Spiritual

Shravan Masam 2024: ఐదు సోమవారాలు, నాలుగు మంగళవారాలు.. ఈసారి శ్రావణం చాలా ప్రత్యేకం..

Published

on

మరి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మహిళలు పూజలు, వ్రతాలతో బిజీ బిజీగా కాలం గడిపేయనున్నారు. ఎందుకంటే రాబోయేది శ్రావణమాసం. ఈసారి శ్రావణ మాసానికి ఓ ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. ఈసారి శ్రావణమాసంలో ఐదు సోమవారాలు రానున్నాయి. అంతేకాక నాలుగు మంగళవారాలు, నాలుగు శుక్రవారాలు ఉన్నాయి. దాంతో శ్రావణమాసం మొత్తం పూజలే పూజలు… పూజలు వ్రతాలు నోములతో మహిళలు అంతా బిజీ షెడ్యూల్. అసలు శ్రావణ మాసంలో ఏ పూజలు చేస్తారు ?.. ఎందుకు చేస్తారు ?… చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం… శ్రావణమాసం మహిళలకు ఎంతో ఇష్టమైన నెల… ఆ నెల అంతా మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో సందడిగా తెలుగు సాంప్రదాయాలు ఉట్టి పడేటట్టుగా పూజలు వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసంలో శ్రావణ వరలక్ష్మీ వ్రతాలతో పాటు, శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు కూడా నిర్వహించడం మహిళలకు పరిపాటి. వాటితోపాటు సోమవారం కూడా ఎంతో విశిష్టమైన రోజు. ఈసారి శ్రావణమాసం జులై 22 సోమవారం నాడు ప్రారంభమై ఆగస్టు 19 సోమవారం నాడు ముగుస్తుంది. అంటే ఈసారి శ్రావణమాసంలో ఐదు సోమవారాలు ఉన్నాయి. అలాగే నాలుగు మంగళవారాలు, నాలుగు శుక్రవారాలు వస్తాయి. మహిళలు వరాలిచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు.

అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం అయిన మహిళలు నిత్య సుమంగళీగా జీవించాలనే సంకల్పంతో ప్రతి ఏట శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం శాశ్వతంగా తమపై ఉండి ఏటువంటి కష్టనష్టాలకు లోను కాకుండా సంతోషంగా జీవిస్తామని మహిళల నమ్మకం. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు. సాధారణంగా శ్రావణమాసంలో నాలుగు శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. అయితే ముఖ్యంగా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని పెద్ద ఎత్తున మహిళలు చేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా పెళ్లయిన మహిళలు మాత్రమే జరుపుకుంటారు. కొత్త జంటలు సంతానం, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తారు. వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టలక్ష్మిలను పూజించినంత ఫలితం వస్తుందని మహిళల విశ్వాసం. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని, తర్వాత పూజ గదిలో బియ్యపు పిండితో ముగ్గు వేసి, కలశం ఏర్పాటు చేసుకుంటారు. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకుని పూజా సామాగ్రి, తోరాలు, అక్షితలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకుని వరలక్ష్మీ వ్రతం కథను చదువుతూ పూజ చేస్తారు.

అదేవిధంగా శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యాల కోసం పార్వతి దేవిని పూజిస్తూ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని వారి నమ్మకం. అందుకే కొత్తగా పెళ్లయిన మహిళలు ఎక్కువగా మంగళ గౌరీ వ్రతం చేస్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో గౌరీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా వివాహమైన సంవత్సరం నుండి ఐదు సంవత్సరాలపాటు కచ్చితంగా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లో, ఆ తరువాత అత్తవారింట్లో జరుపుకుంటారు. ముఖ్యంగా పురాణాల ప్రకారం చూస్తే పరమ శివుడు కూడా మంగళ గౌరి దేవిని ఆరాధించి త్రిపురాంతర సంహారం చేశారని చెబుతారు. తొలిసారిగా వ్రతాన్ని చేసే మహిళలు తమ తల్లిని పక్కన పెట్టుకొని పూజ చేసి తొలి వాయనాన్ని తల్లికే అందిస్తే మంచిదని వారి నమ్మకం. అలా కాని పక్షంలో తమ అత్తకు కానీ, లేదా ఇతర ముత్తైదువలకు గాని వాయనం అందిస్తారు.

మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడానికి ముందు వ్రత నియమాలు భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. వ్రతం చేసుకునే ముందు రోజు, వ్రతం రోజు కూడా భార్యాభర్తలు దాంపత్య సుఖానికి దూరంగా ఉంటారు. వ్రతం రోజు వ్రతం చేసుకునే మహిళలు ఉపవాసం చేస్తారు. వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇస్తారు. వ్రతం చేసుకునే అన్ని మంగళవారాలలో ఒకే మంగళ గౌరీ దేవి విగ్రహాన్ని ఉపయోగిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వరు. ఎందుకంటే సౌభోగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి పసుపు కుంకుమలు ఇవ్వడం మంచిది కాదని భావిస్తారు. ఇలా మహిళలు వ్రతాలు పూజలతో శ్రావణమాసం మొత్తం బిజీగా గడిపేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version