International

యూఏఈని మరోసారి వణికించిన భారీ వర్షాలు.. విమాన సేవలకు అంతరాయం

Published

on

Dubai Rain: భారీ వర్షాలు, పిడుగులు మరోసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ని మరోసారి వణికించాయి. దీంతో దుబాయ్ ఎయిర్ పోర్టుకు పలు అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. రెండు వారాల క్రితం భారీ వర్షాలతో యూఏఈ స్తంభించిపోయింది. తాజాగా మరోసారి భారీ వర్షంతో అరబ్ దేశంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షాల కారణంగా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొవడానికి నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) సిద్ధంగా ఉంది.

గత నెలలో దేశంలో కురిసిన భారీ వర్షాల కంటే ఇప్పుడు తక్కువగా వర్షం పడినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూఏఈ ప్రభుత్వం సూచించింది. ఏప్రిల్ 14-15 తేదీల్లో రికార్డుస్థాయిలో వర్షం పడడంతో యూఏఈ మునుపెన్నడూ చూడనివిధంగా వరద ముప్పు ఎదుర్కొంది. ఏడాది వర్షంపాతం ఒక్కరోజులో నమోదయిందని వార్తలు వచ్చాయి.

ప్రతికూల వాతావరణం కారణంగా దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ గురువారం అనేక విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. దుబాయ్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేయడంతో విమానాలు ఆలస్యం అయ్యే అవకాశముందని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. వర్షాల కారణంగా విద్యాసంస్థలు రెండు రోజుల పాటు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version