International
‘సీక్రెట్ సర్వీస్ వైఫల్యమే’- ట్రంప్‌పై కాల్పుల కేసులో డైరెక్టర్ అంగీకారం – Trump Shooting Case
Trump Was Attacked : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కాల్పుల దాడి నుంచి రక్షించడంలో తమ ఏజెన్సీ విఫలమైందని సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటల్ అంగీకరించారు. ట్రంప్‌పై జరిగిన దాడి సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి కొన్ని దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన వైఫల్యమని ఆమె అభివర్ణించారు. కాల్పులకు కొంత సమయం ముందు ఓ అనుమానిత వ్యక్తి గురించి తమ ఏజెన్సీకి స్థానిక పోలీసుల నుంచి సమాచారం అందిందని తెలిపారు. అయితే వారు అది కచ్చితంగా ప్రమాదమని చెప్పలేదని, హెచ్చరించి ఉంటే ర్యాలీని సీక్రెట్ సర్వీస్ నిలిపివేసేదని కింబర్లీ పేర్కొన్నారు. అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల చట్టసభ సభ్యులతో జరిగిన కాంగ్రెస్ విచారణలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు.
నిందితుడు క్రూక్స్ కాల్పులు జరిపిన ఇంటి వద్ద భద్రతా సిబ్బంది ఎందుకు లేరని, డ్రోన్లతో ఎందుకు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించలేదని చట్టసభ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభ సభ్యులు వేసిన పలు ప్రశ్నలకు కింబర్లీ చీటల్ సమాధానాన్ని దాటవేశారు. వాటిపై విచారణ జరుగుతోందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. జులై 13 నాటి పెన్సిల్వేనియా ర్యాలీలో భద్రతా లోపానికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని కింబర్లీ చీటల్ చెప్పినప్పటికీ, తాను రాజీనామా చేయాలనుకుంటున్నట్టు మాత్రం ఎటువంటి సూచన ఇవ్వలేదు. కానీ మరోసారి ఈ తరహా ఘటన పునరావృతం కాదని పేర్కొన్నారు.
ఇదీ జరిగింది!
అమెరికాలో ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిప్లబికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష రేసులో దిగిన ట్రంప్ విజయం కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా ఓ భవనంపై నక్కిన వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మాజీ అధ్యక్షుడి కుడి చెవికి గాయమైంది. అయితే కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.