Andhrapradesh
Schools Reopening: ఏపీలో నేటి నుంచి మోగనున్న బడి గంటలు, విద్యాకానుక కిట్ల పంపిణీకి ఏర్పాట్లు
Schools Reopening: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి పాఠశాలలుsar తెరుచుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు గురువారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి.
ఏప్రిల్ 24న ప్రారంభమై వేసవి సెలవులు జూన్ 11తో ముగిశాయి. జూన్ 12న స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో వేసవి సెలవులు ఒక రోజు పొడిగించారు. దీంతో జూన్ 13న (గురువారం)తో పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్నాయి.
ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటలకు ఉంటాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదనందున ఇప్పటి వరకు పాఠాశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించలేదు. పాఠాశాలలు ఎన్ని రోజులు ఎన్ని రోజులు నడుస్తాయి? దసరా, సంక్రాంతి, క్రిస్మస్, దీపావళి సెలవులు ఎన్ని రోజులు? ఫార్మెటివ్ అసెస్మెంట్, సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షల నిర్వహణ ఎప్పుడనేది రూపొందించలేదు. అయితే పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అకడమిక్ క్యాలెండర్‌ను ఖరారు చేయనున్నారు.
యథావిధిగా విద్యా కానుక కిట్లు పంపిణీ
మరోవైపు ప్రభుత్వం మారినంత మాత్రాన విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్లను ఆపొద్దని, వాటిని యథావిధిగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశాలు ఇచ్చారు. వాటిపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నప్పటికీ యథావిధిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు టీడీపీ అధికారికంగా ట్వీట్ కూడా చేసింది.
“ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదు. జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను అలాగే పంపిణీ చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు” అంటూ టీడీపీ అధికారికంగా ట్విట్టర్ లో పేర్కొంది.
రాష్ట్రంలో జగనన్న విద్యాకానుకను రాష్ట్ర ముఖ్యమంత్రి 2021 ఆగస్టు 16న ప్రారంభించారు. ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఎనిమిది ఐటమ్స్ తో కూడిన కిట్లు ఇస్తారు. రెండు జతల స్కూల్ యూనిఫాం (స్టిచింగ్ ఛార్జీలుతో సహా), పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, తెలుగు-ఇంగ్లీష్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, బెల్టు, రెండు జతల నలుపు షూస్, రెండు జతల సాక్సులతో కూడిన కిట్లు ప్రతి విద్యార్థికి అందజేస్తారు.
రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 44,57,441 మంది ఉన్నారు. వీరందరికీ జగనన్న విద్యా కనుక (జేవీకే) కిట్లును ఇవ్వనున్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో విద్యా కానుక కిట్లుపై సందిగ్ధత నెలకొంది. మాజీ సీఎం ఫోటో తో ఉన్న కిట్లు పంపిణీ చేయాలా వద్దా అని విద్యా శాఖ ఎదురు చూసింది.
అయితే డబ్బు వృధా కాకుండా ఉండేందుకు జగన్ ఫోటో ఉన్నప్పటికీ కిట్లు పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూల్స్‌లో నేటీ నుంచే విద్యా కానుక కిట్లు పంపిణీ జరుగుతాయి. అయితే కొద్ది రోజుల్లో మాత్రం జగనన్న విద్యా కానుక పథకం మారే అవకాశం ఉంది.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠాశాల్లో పిఎం పోషణ, మధ్యాహ్నం భోజనం పథకం కొనసాగుతుంది. జగనన్న గోరుముద్ద పథకం పేరు కూడా కొన్ని రోజుల్లో మార్చనున్నారు.