International
Russia-China Ties : ఎవరు పెద్దన్న.. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడమే రష్యా, చైనా ఉమ్మడి లక్ష్యం!
Russia-China Ties : రష్యా, చైనా ఉమ్మడి లక్ష్యం ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడమే. ఇప్పటిదాకా చూడని మార్పులను ఇకముందు చూసే అవకాశముందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అన్నారు. దీనర్ధం అమెరికాకు చెక్‌పెట్టడమే. ప్రపంచ క్రమాన్ని మార్చాల్సిన అవసరముందని పుతిన్ యుక్రెయిన్ యుద్ధ సమయంలో పదే పదే అన్నారు. అదే లక్ష్యంతో రష్యా, చైనా కలిసి పనిచేస్తున్నాయి. రష్యా, చైనా మధ్య చారిత్రక, చిరకాల మైత్రీ బంధం ఉన్నప్పటికీ… అమెరికా ఏకధ్రువ ప్రపంచ విధానాన్ని మార్చాలన్న భౌగోళిక రాజకీయ లక్ష్యం.. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ స్నేహం అవకాశవాదం కాదని, ప్రపంచానికి సుస్థిరత కలిగించే అంశమని ఇరుదేశాధినేతలు అంటున్నారు. తమ మైత్రికి రెండు దేశాలు ఏ పేరు పెట్టుకున్నప్పటికీ.. మొత్తంగా అమెరికా కలవరపడేలా ప్రపంచ పరిణామాలు మారిపోతున్నాయన్నది మాత్రం అంగీకరించి తీరాల్సిన నిజం.
అమెరికా అగ్రరాజ్యంగా మారిన తర్వాత అంతర్జాతీయంగా కీలక ఘటనలన్నీ ఆ దేశం కనుసన్నల్లోనే జరిగేవి. ఎవరు, ఎవరికి ఆయుధాలు అమ్మాలి..ఎవరు కొనాలి..అణుబాబులు ఎవరు తయారుచేయాలి.. ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలి వంటివాటన్నింటినీ పరోక్షంగా పర్యవేక్షించేది అమెరికా. అమెరికాకు ఇష్టం లేకపోతే..ఓ దేశంలో ప్రజాదరణ ఉన్న నేత కూడా మంత్రి పదవి దక్కించుకోలేరన్న ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు అమెరికా ఆ స్థితిలో లేదు. అసలు సొంత వ్యవహారాలే చక్కపెట్టుకోలేక సతమతమవుతోంది. అలాగని అమెరికాని తక్కువ అంచనా వేయడానికీ లేదు. అందుకు వేర్వేరు దారుల్లో కాకుండా శత్రువుకు ఉమ్మడిగా చెక్ పెట్టేందుకు రష్యా, చైనా ప్రయత్నిస్తున్నాయి.
ఒకప్పుడు అమెరికాకు శత్రుదేశం అంటే.. అనేక దేశాలకు శత్రువే అన్న అభిప్రాయం ఉండేది. తమ శత్రుదేశంతో మిగిలిన ఏ దేశమూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోకుండా అమెరికా పర్యవేక్షించేది. ఆంక్షల పేరుతో హెచ్చరించేది. కానీ అమెరికా ఇప్పుడు ఆ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించే స్థితిలోలేదు. ఇరాన్‌తో తాజాగా భారత్ కుదర్చుకున్న చాబహార్ పోర్టు నిర్వహణా ఒప్పందమే ఇందుకు ఉదాహరణ. ఒప్పందానికి ముందూ తర్వాత ఆంక్షల పేరుతో అమెరికా భయపెట్టేందుకు ప్రయత్నించినా భారత్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అలాగే రష్యా దగ్గర ఎవరూ చమురు కొనకుండా చేయాలన్న అమెరికా ప్రయత్నాలను కూడా భారత్ తిప్పికొట్టింది. యుక్రెయిన్ యుద్ధం మొదలయిన తర్వాత భారత్ రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది.
ప్రపంచ పెద్దన్న హోదా నుంచి తప్పించడానికే.. :
ఇక రష్యా, యుక్రెయిన్ యుద్ధం సంగతే చూసుకుంటే….రష్యాతో యుద్ధం విరమింపచేసేందుకు, యుద్ధంలో యుక్రెయిన్ గెలిచేలా చేసేందుకు, రష్యాకు నష్టం కలిగించేందుకు అమెరికా అన్ని అస్త్రాలూ ప్రయోగించింది. కానీ యుద్ధాన్ని కానీ, యుక్రెయిన్ వినాశనాన్ని కానీ అమెరికా ఆపలేకపోయింది. అసలు రష్యా యుద్ధానికి కారణంగా చూపిన యుక్రెయిన్‌కు నాటో సభ్యత్వాన్ని సైతం ఇంతవరకూ నెరవేర్చలేకపోయింది అమెరికా. చాలా ప్రపంచ దేశాలు గతంలోలా అమెరికా అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు. అగ్రరాజ్యం పెత్తననానికి తలొగ్గడం లేదు. ఇదే అదనుగా అమెరికా ప్రపంచ పెద్దన్న హోదా నుంచి తప్పించడానికి అటు పుతిన్, ఇటు జిన్‌పింగ్ విశ్వప్రయత్నాలూ చేస్తున్నారు.
యుద్ధం పరిస్థితుల తర్వాత రష్యాలో అంతర్గతంగా అసంతృప్తి ఉందన్న ప్రచారాన్ని ఐదోసారి అధ్యక్షునిగా ఎన్నికవడం ద్వారా పుతిన్ తిప్పికొట్టారు. ఇంట గెలవడంతో ఇక రచ్చ గెలిచే పనిమొదలుపెట్టారు. తొలి విదేశీ పర్యటన కోసం చైనా వచ్చిన పుతిన్ యుక్రెయిన్ యుద్ధంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు సిద్దంగా ఉన్నామని పుతిన్, జిన్‌పింగ్ ప్రకటించారు. సంప్రదింపుల ద్వారా యుద్ధం ముగిసేలా కృషిచేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనన్నారు. మొత్తంగా అమెరికా కోరుకుంటేనో, ఒత్తిడి తెస్తేనో యుద్దం ఆగదని, తాము ఆపాలనుకుంటే మాత్రమే యుద్ధం ఆగుతుందని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశారు పుతిన్. అలాగే రష్యా, చైనా బంధం అవకాశవాదం కాదని, రెండు దేశాల మధ్య వ్యూహపరమైన బంధానికి అడ్డంకులు సృష్టించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సాగనివ్వబోమని పుతిన్, జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాల ప్రజలతో పాటు మొత్తం ప్రపంచం సుస్థిరతకు, శాంతికి తమ మైత్రీబంధం ప్రయోజనం కలిగిస్తుందని విశ్లేషించారు.
చైనా పర్యటనలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. పుతిన్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే పుతిన్, జిన్ పింగ్ అనుకున్నట్టుగా అమెరికాకు చెక్ పెట్టడానికి రష్యా, చైనా అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. చైనా ఆర్థిక వృద్ధిరేటు మందగమనంలో సాగుతోంది. వృద్ధ జనాభా, ఉత్పాదకత గతంలో ఉన్నంత స్థాయిలో లేకపోవడం, నియంతృత్వ పాలన, తైవాన్ అంశం వంటివి చైనాకు ప్రతిబంధకాలుగా ఉన్నాయి. యుద్ధం వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారడం, అమెరికా సహా ఇతర దేశాల ఆంక్షలు, నాటో విస్తరణ, దీర్ఘకాలికంగా పుతిన్ అధికారంలో ఉండటంతో పెరిగిపోతున్న రాజకీయ అసంతృప్తులు వంటివాటిని రష్యాకు అడ్డంకులుగా ఉన్నాయి. ఈ సవాళ్లను దాటుకుని 71 ఏళ్ల పుతిన్, 70 ఏళ్ల జిన్‌పింగ్ రష్యా, చైనాలను ప్రపంచంలో ఏ హోదాలో నిలబెడతారన్నది చూడాల్సి ఉంది.
చైనా అతిపెద్దపోటీదారుగా, రష్యా ప్రమాదకరదేశంగా :
అమెరికా మాత్రం రెండు దేశాలను శత్రువుగానే చూస్తోంది. చైనాను అతిపెద్దపోటీదారుగా, రష్యాను ప్రమాదకరదేశంగా అమెరికా పరిగణిస్తోంది. పుతిన్‌ను హంతకుడిగా, జిన్‌పింగ్‌ను నియంతగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు బైడన్.. ఈ నిర్వచనాలు ఎలా ఉన్నప్పటికీ.. అగ్రరాజ్యం పరిస్థితి గతంలోలా లేదన్నది మాత్రం అంగీకరించాల్సిందే. అసలు ఈ ఏడాది అమెరికాలో జరగబోయే ఎన్నికలపై కూడా రష్యా, చైనా ప్రభావం చూపబోతున్నాయి. 2016లో ట్రంప్ గెలుపుకు పుతిన్ సహకరించారన్న ప్రచారం ఉంది. అదే తరహాలో ఈ సారి కూడా బైడన్‌ను గద్దెదింపి ట్రంప్‌కు అమెరికా అధికారపీఠం కట్టబెట్టాలని పుతిన్, జిన్‌పింగ్ భావిస్తున్నారన్న ప్రచారమూ సాగుతోంది. మొత్తంగా ఇతర దేశాలకు అధినేతలను నియమించే స్థాయి నుంచి అమెరికా తమ దేశ ఎన్నికలనూ శత్రుదేశాలు ప్రభావితం చేసేస్థాయికి దిగజారిపోయింది.