Crime News
రూ.50 కోట్ల బంగారు టాయిలెట్ చోరీ కేసులో.. నేరాన్ని అంగీకరించిన వ్యక్తి
Gold Toilet Theft Case : ఇంగ్లాండ్ లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్ లోని 300ఏళ్ల క్రితం నాటి బ్లెన్‌హెమ్ ప్యాలెస్ నుంచి సుమారు 18 క్యారెట్ల బంగారు టాయిలెట్ దోపిడీకి గురైన విషయం తెలిసిందే. దీని విలువ 4.8 మిలియన్ పౌండ్లు (రూ. 50,36,23939). 2019లో సెప్టెంబర్ నెలలో ఇది దోపిడీకి గురైంది. లండన్ పోలీసులు రంగంలోకిదిగి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు.. కానీ, వారిలో ఎవరూ నేరాన్ని అంగీకరించలేదు. తాజాగా, నార్తాంప్టన్‌షైర్‌లోని వెల్లింగ్‌బరో పట్టణంకు చెందిన జేమ్స్ షీన్ (39ఏళ్లు) దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించాడు. షీన్ హెచ్ఎంపీ ఫైవ్ వెల్స్ నుండి వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరయ్యాడు. అతడు.. న్యూమార్కెట్ లోని నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి కోట్లాది రూపాయల విలువైన వస్తువులను దొంగిలించిన కేసులో ఇప్పటికే 17 సంవత్సరాలు శిక్షను అనుభవిస్తున్నాడు.
18 క్యారెట్ల ఈ బంగారు టాయిలెట్ ను గతంలో న్యూయార్క్ లోని గుగ్గెన్‌హీమ్ మ్యూజియంలోనూ ప్రదర్శించారు. బంగారు టాయిలెట్ ను ఇటలీకి చెందిన మారిజియో కేటెలన్ అనే కళాకారుడు తయారు చేశాడు. బ్లెన్‌హెమ్ ప్యాలెస్ కు చారిత్రక ప్రాముఖ్యత కలిగిఉంది. యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధాన మంత్రి విన్‌స్టన్ చర్చిల్ జన్మస్థలం ఇది. ఈ ప్యాలెస్ 18వ శతాబ్దపు భవనం. విలువైన కళ, ఫర్నీచర్ కలిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. ఎగ్జిబిషన్ సమయంలో బంగారు టాయిలెంట్ ఇందులో అమర్చారు. దొంతనం జరగడానికి ముందు గోల్డెన్ టాయిలెట్ పూర్తిగా పనిచేస్తుంది. సందర్శకులు ముందస్తు అపాయింట్ మెంట్ లో దీనిని సందర్శించే అవకాశం కల్పించారు.
దొంగలు ఈ బంగారు టాయిలెంట్ ను తీసుకెళ్లడానికి దాని పైప్ లైన్ ధ్వంసం చేశారని పోలీసులు చెప్పారు. దీంతో ఆ సమయంలో భవనంలోపల నీళ్లతో నిండిపోయిందని తెలిపారు. దీనిని తానే దొంగిలించినట్లు జేమ్స్ షీన్ ఒప్పుకోవటంతో ఈ దొంగతనం కేసు కొలిక్కి వచ్చినట్లయింది. అయితే, మరో ముగ్గురు వ్యక్తులు ఈ దొంగతనం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. బంగారం టాయిలెట్ ను తరలించేందుకు జేమ్స్ షీన్ కు వారు సహకరించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 2025లో విచారణకు రానున్నారు.