International

రోహింజ్యాలను ఒకప్పుడు ఊచకోత కోసిన మియన్మార్ ఆర్మీ ఇప్పుడు వారి సాయం ఎందుకు కోరుతోంది?

Published

on

మియన్మార్ సైన్యం వేలాది మంది రోహింజ్యాలను చంపి, లక్షలాది మందిని పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌కి తరిమేసింది
వేలాది మంది ముస్లిం రోహింజ్యాలను ఊచకోత కోసిన మియన్మార్ సైన్యం దాదాపు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు వారి సాయం కోరుతోంది.

అప్పటి ఈ దారుణ అణచివేతను ఐక్యరాజ్యసమితి జాతి నిర్మూలన ఉదంతానికి స్పష్టమైన ఉదాహరణగా అభివర్ణించింది.

రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్న వందలాది మంది రోహింజ్యాలను బీబీసీ ఇంటర్వ్యూ చేసినప్పుడు, వారిలో కనీసం 100 మందిని కొద్దివారాల కిందట బలవంతంగా సైన్యంలో చేర్చుకున్నట్లు తెలిసింది. వారి ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారి పేర్లను మార్చాం.

”నాకు భయమేసింది. కానీ వెళ్లక తప్పలేదు” అని ముగ్గురు చిన్నపిల్లలున్న రోహింగ్యా మహ్మద్ చెప్పారు. ఆయన రఖైన్ రాజధాని సిట్వేలోని బా డు ఫా క్యాంప్‌లో ఉంటున్నారు. ఊచకోత కారణంగా నిర్వాసితులైన దాదాపు 1,50,000 మంది రోహింజ్యాలు దశాబ్ద కాలంగా ఐడీపీ శిబిరాల్లోనే తలదాచుకోవాల్సి వస్తోంది.

ఫిబ్రవరి నెల మధ్యలో ఓ రోజు అర్థరాత్రి క్యాంప్ లీడర్ తన వద్దకు వచ్చారని మహ్మద్ చెప్పారు. సైనిక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ”ఇవి ఆర్మీ ఆదేశాలు” అంటూ ఆయన చెప్పిన విషయాలను మహ్మద్ గుర్తు చేసుకున్నారు. ”అందుకు నువ్వు నిరాకరిస్తే వాళ్లు నీ కుటుంబానికి హాని చేస్తారని బెదిరించారు.”

Advertisement

క్యాంపుల చుట్టూ తిరుగుతూ యువకులు సైనిక శిక్షణకు వెళ్లాలని ఆదేశించారని చెప్పిన కొందరు రోహింజ్యాలతో బీబీసీ మాట్లాడింది.

ఇప్పటికీ రోహింజ్యాలకు పౌరసత్వాన్ని నిరాకరిస్తున్నారు. బయటి ప్రాంతాల్లో ప్రయాణంపై నిషేధం ఉంది. ఇలాంటి వివక్షాపూరిత పరిమితులకు లోబడి జీవించడం మహ్మద్ లాంటి రోహింజ్యాలకు ఇప్పటికీ భయంకరమైన విషయమే.

రోహింజ్యాలు దశాబ్ద కాలంగా శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది
2012లో వేల సంఖ్యలో రోహింజ్యాలను రఖైన్ రాష్ట్రం నుంచి తరిమేశారు. ఆ తర్వాత వారు దుర్భరమైన శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఐదేళ్ల తర్వాత 2017లో సైన్యం క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టి వేలాది మందిని క్రూరంగా హత్య చేయడం, మహిళలపై అత్యాచారాలు, గ్రామాలను తగలబెట్టడంతో దాదాపు 7 లక్షల మంది రోహింజ్యాలు పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయారు. వారిలో 6,00,000 మంది ఇప్పటికీ అక్కడే ఉన్నారు.

రోహింజ్యాలపై వ్యవహరించిన తీరుపై మియన్మార్ ఇప్పుడు హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణహోమం కింద విచారణను ఎదుర్కొంటోంది.

అదే సైన్యం ఇప్పుడు రోహింజ్యాలను బలవంతంగా నియమించుకోవడం దాని నిస్సహాయతకు సంకేతం. జాతిపరమైన తిరుగుబాటుదారుల గ్రూపు అరకాన్ ఆర్మీ ఇటీవల రఖైన్‌లో భారీ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఇదే రఖైన్‌లో డజన్ల కొద్దీ రోహింజ్యాలు సైనిక ఫిరంగులు, వైమానిక బాంబు దాడుల్లో చనిపోయారు.

Advertisement

దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రత్యర్థి దళాల చేతిలో మియన్మార్ మిలిటరీ భారీ నష్టాలను చవిచూసింది. తూర్పు సరిహద్దున థాయ్‌లాండ్‌ బోర్డర్‌లో ఉన్న మైవాడి అనే పట్టణంపై కూడా శనివారం సైన్యం నియంత్రణ కోల్పోయింది. భూఉపరితల మార్గాల్లో అత్యధికంగా ఈ మార్గం ద్వారానే వాణిజ్యం జరుగుతుంది.

మియన్మార్ సైన్యం పెద్ద సంఖ్యలో సైనికులను కూడా కోల్పోయింది. చాలా మంది చనిపోయారు, గాయాలపాలయ్యారు. మరికొందరు ప్రత్యర్థికి లొంగిపోవడం లేదా ఫిరాయించేశారు. దీంతో సైన్యానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కష్టమయ్యాయి. జనాదరణ లేని పాలన, పాలకుల కోసం ప్రాణాలు పణంగా పెట్టేవారు చాలా తక్కువ మందే ఉంటారు.

దీంతో తమను మరోసారి లక్ష్యంగా చేసుకుంటున్నారని రోహింజ్యాలు భయపడుతున్నారు. ఈ యుద్ధంలో సైన్యం ఓడిపోతున్నట్లు కనిపిస్తోంది.

తనను సిట్వేలోని 270వ లైట్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు తీసుకెళ్లారని మహ్మద్ చెప్పారు. 2012లో జరిగిన జాతి హింస కారణంగా తరిమివేసినప్పటి నుంచి రోహింజ్యాలకు ఈ పట్టణంలో నివాసంపై నిషేధం ఉంది.

”బుల్లెట్లు ఎలా లోడ్ చేయాలి, ఎలా కాల్చాలనే విషయాలను నేర్పించారు” అని చెప్పారు. ”తుపాకీని ఊడదీయడం, మళ్లీ బిగించడం ఎలాగో చూపించారు.”

మియన్మార్ సైన్యం, జాతిపరమైన తిరుగుబాటు గ్రూపు మధ్య మూడేళ్లుగా అంతర్యుద్ధ కొనసాగుతోంది
మహ్మద్‌కు రెండు వారాలపాటు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఇంటికి పంపించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ తీసుకెళ్లి, మరో 250 మంది సైనికులున్న బోటులో ఎక్కించారు. రాథేడాంగ్‌ నదిలో ఐదుగంటల ప్రయాణం సాగింది. అక్కడి కొండలపై ఉన్న మూడు సైనిక స్థావరాలపై పట్టు కోసం అరకాన్ ఆర్మీతో భీకర యుద్ధం జరుగుతోంది.

Advertisement

”నేను ఎందుకు పోరాడుతున్నానో నాకు తెలీదు. వాళ్లు నన్ను రఖైన్‌లో కాల్పులు చేయమని చెప్పినా, చేయాలి.”

మహ్మద్ అక్కడ 11 రోజులపాటు పోరాడారు. అక్కడ ఆహారం నిల్వవుంచే గుడిసెపై బాంబు పడడంతో ఆహార కొరత తలెత్తింది. బలవంతంగా తీసుకెళ్లిన రోహింజ్యాలు ఫిరంగుల దాడిలో చనిపోవడం చూశారు. బాంబు పేలి పదునైన వస్తువు దూసుకొచ్చి తన రెండుకాళ్లకు గాయాలవడంతో ఆయనను చికిత్స కోసం సిట్వేకి తీసుకొచ్చారు.

ఆ మూడు స్థావరాలను స్వాధీనం చేసుకున్న తర్వాత అరకాన్ ఆర్మీ మార్చి 20న యుద్ధభూమి నుంచి ఫోటోలను విడుదల చేసింది. అందులో చాలా మంది శవాలుగా పడివున్నారు. వారిలో ముగ్గురిని రోహింజ్యాలుగా గుర్తించారు.

”యుద్ధంలో ఉన్న సమయంలో నాకు భయంభయంగానే ఉంది. నా కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్నా. అలా యుద్ధం చేయాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇంటికి వెళ్లాలనిపించింది. ఆస్పత్రి నుంచి ఇంటికి రాగానే అమ్మను కౌగిలించుకుని ఏడ్చేశా. మా అమ్మ కడుపులో నుంచి మళ్లీ పుట్టినట్లు అనిపించింది.” అని మహ్మద్ చెప్పారు.

బలవంతంగా తీసుకెళ్లిన మరో రోహింజ్యా హుస్సేన్ సిట్వే సమీపంలోని ఓహ్న్ తా గ్యి క్యాంప్ నుంచి వచ్చారు. ఆయన సోదరుడు మహమూద్‌ను ఫిబ్రవరిలో తీసుకెళ్లి సైనిక శిక్షణ పూర్తి చేయించారని, అయితే యుద్ధానికి పంపేలోపు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని చెప్పారు.

Advertisement

అయితే, అరకాన్ ఆర్మీతో పోరాడేందుకు రోహింజ్యాలను ఉపయోగించుకుంటున్నారన్న వాదనలను సైన్యం ఖండించింది. వారిని యుద్ధభూమిలోకి పంపే ఆలోచన లేదని సైన్యం అధికార ప్రతినిధి జా మిన్ తున్ బీబీసీతో చెప్పారు. ”వారికి మేం భద్రత కల్పించాలనుకుంటున్నాం. వాళ్ల రక్షణ కోసమే సాయంగా ఉండాలని కోరాం” అన్నారు.

కానీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో, సిట్వే సమీపంలోని ఐదు వేర్వేరు ఐడీపీ శిబిరాల్లో ఉంటున్న ఏడుగురు రోహింజ్యాలు ఒకే విషయం చెప్పారు. ఈ ఏడాది రిక్రూట్ చేసుకుని, యుద్ధానికి పంపిన కనీసం వంద మంది రోహింజ్యాల గురించి తమకు తెలుసని వారు చెప్పారు.

రఖైన్ రాష్ట్రంలో రోహింజ్యాలు ఇప్పుడు సైన్యం, తిరుగుబాటు గ్రూపుల మధ్య చిక్కుకున్నారు
సైన్యం, స్థానిక ప్రభుత్వాధికారుల బృందాలు ఫిబ్రవరిలో శిబిరాలకు వచ్చాయని, యువకులు నిర్బంధ సైనికులుగా చేరాల్సి ఉంటుందని, సైన్యంలో చేరితే వారికి ఆహారం, వేతనాలతో పాటు పౌరసత్వం కూడా లభిస్తుందని తొలుత చెప్పారని వారు అన్నారు. అవి వారికి బలమైన ఎరలు.

అరకాన్ ఆర్మీతో రోజురోజుకీ ఘర్షణలు పెరగడం, అంతర్జాతీయంగా సహాయ సామగ్రి నిలిపివేతతో ఐడీపీ శిబిరాల్లో ఆహార కొరత ఏర్పడడంతో పాటు ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈ పౌరసత్వ నిరాకరణ అనేది రోహింజ్యాల సుదీర్ఘ పోరాటంలో గుండెకాయ వంటిదని, వర్ణవివక్ష మాదిరిగా సమాజంలో గూడుకట్టుకుపోయిన ఒక వివక్ష అని మానవ సంఘాలు అభివర్ణిస్తున్నాయి.

అయితే, సైనికులు బలవంతంగా వారిని తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు, ఈ పౌరసత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. దేశ పౌరులు కానివారు నిర్బంధంగా సైన్యంలో ఎందుకు చేరాలని అడిగినప్పుడు, మీరు నివసిస్తున్న భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మీపై కూడా ఉంటుందని వారికి చెప్పారు. వాళ్లు సాయుధులే కానీ, సైనికులు కాదని చెప్పారు. పౌరసత్వం గురించి అడిగినప్పుడు ”మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు” అని సమాధానం వచ్చింది.

నిర్బంధ సైన్యంలో చేరే వారి జాబితా కోసం సైన్యం డిమాండ్ చేస్తోందని ఒక క్యాంప్ కమిటీ సభ్యుడు తెలిపారు. అయితే ఇంతకుముందు యుద్ధంలోకి వెళ్లిన వారి అనుభవాలను తెలుసుకున్న తర్వాత ఎవరూ అంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదని ఆయన చెప్పారు.

Advertisement

దీంతో క్యాంపు నాయకులు ఇప్పుడు పేద వర్గాలకు చెందిన పురుషులను, ఉద్యోగాలు లేనివారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు సైన్యంలోకి వెళ్లిన సమయంలో, వారి కుటుంబాలను పోషించుకునేందుకు విరాళాల ద్వారా వచ్చిన సొమ్ము అందజేస్తామని చెబుతున్నారు.

”ఇలా నిర్బంధంగా సైన్యంలో చేర్చుకోవడం చట్టవిరుద్ధం. బలవంతంగా పని చేయించుకోవడంతో సమానం” అని మానవ హక్కుల సంఘం ఫోర్టిఫై రైట్స్‌కి చెందిన మాథ్యూ స్మిత్ అన్నారు.

”దీనివెనక క్రూరమైన, దుర్మార్గమైన ప్రయోజనం దాగుంది. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ప్రజాస్వామ్య విప్లవాన్ని నిరోధించే ప్రయత్నంలో రోహింజ్యా మారణహోమం బాధితులను సైన్యం నిర్బంధంగా వాడుకుంటోంది. మనుషుల జీవితాలకూ ఈ పాలనకూ ఎలాంటి సంబంధం లేదు.

“జరుగుతున్నదానికి క్రూరమైన మరియు దుర్మార్గమైన ప్రయోజనం ఉంది. దేశవ్యాప్త ప్రజాస్వామ్య విప్లవాన్ని నియంత్రించే ప్రయత్నంలో సైన్యం రోహింజ్యా మారణహోమం బాధితులను బలవంతంగా వాడుకుంటోంది. ఈ పాలకులకు మనిషి ప్రాణాలపై ఎలాంటి గౌరవం లేదు. సుదీర్ఘ కాలంగా జరుగుతున్న దురాగతాలకు ఇది కొనసాగింపు.”

అరకాన్ ఆర్మీతో జరుగుతున్న పోరాటంలో రోహింజ్యాలను వాడుకోవడం ద్వారా రఖైన్‌లోని సంప్రదాయ బౌద్ధ జనాభాతో మతవివాదం మళ్లీ రాజేస్తామని మియన్మార్ సైన్యం బెదిరించింది. వీరిలో ఎక్కువ మంది తిరుగుబాటుదారులకు మద్దతుగా నిలుస్తున్నారు.

Advertisement

2012లో రెండు జాతుల మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా సిట్వే వంటి పట్టణాల నుంచి వేల మంది రోహింజ్యాలను బహిష్కరించారు. 2017లో రోహింజ్యాలపై సైన్యం చేసిన దాడుల్లో రఖైన్ పురుషులు కూడా పాల్గొన్నారు.

ఆ తర్వాత రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి.

2017లో రఖైన్ రాష్ట్రంలోని కొన్ని గ్రామాలకు గ్రామాలను దగ్ధం చేశారు
మియన్మార్‌లో సైనిక ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త సమాఖ్య వ్యవస్థను రూపొందించేందుకు ఇతర జాతుల సమూహాలు, ప్రత్యర్థి సమూహాలతో కలిసి అరకాన్ ఆర్మీ పోరాడుతోంది.

ప్రస్తుతం రఖైన్ రాష్ట్రంలో విజయానికి చేరువైన అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన రోహింజ్యా జనాభాను అంగీకరించే అవకాశాన్ని సూచిస్తూ ఇక్కడ నివసిస్తున్న వారందరికీ పౌరసత్వం గురించి ప్రస్తావించింది.

అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మళ్లీ మారింది.

Advertisement

అరకాన్ ఆర్మీ ప్రతినిధి ఖైంగ్ తుఖా బీబీసీతో మాట్లాడుతూ, రోహింజ్యాలను సైన్యం కోసం పోరాడాలని నిర్బంధించడాన్ని “మారణహోమం బాధితులకు, నియంతృత్వం నుంచి విముక్తి కోసం పోరాడుతున్న వారికి ఇది తీరని ద్రోహం” అని ఆయన అభిప్రాయపడ్డారు.

అరకాన్ ఆర్మీకి వ్యతిరేకంగా బుతిడాంగ్‌లో రోహింజ్యాలు నిరసన తెలుపుతున్నట్లు కనిపిస్తున్న ఘటనలకు మిలిటరీ అనుకూల మీడియా కూడా ప్రచారం కల్పిస్తోంది. అయితే, రెండు గ్రూపులుగా విభజించే ప్రయత్నంలో సైన్యమే ఈ నిరసనలు నిర్వహించినట్లు స్థానికులు బీబీసీతో చెప్పారు.

మియన్మార్‌లో నివసించే హక్కు కల్పించని సైన్యం కోసం ఇప్పుడు రోహింజ్యాలు పోరాడాల్సి వచ్చింది, తద్వారా రఖైన్‌లో ఎక్కువ భాగాన్ని నియంత్రణలోకి తెచ్చుకోగలిగిన జాతిపరమైన తిరుగుబాటుదారులను వారికి దూరం చేస్తున్నారు. ఒకప్పుడు ఇద్దరికీ టార్గెట్ అయినవారు ఇప్పుడు ఇద్దరి మధ్య చిక్కుకున్నారు.

తమ తరఫున యుద్ధంలో పాల్గొన్నట్లు మహ్మద్‌కు సైన్యం సర్టిఫికెట్ ఇచ్చింది. అది ఎందుకు పనికొస్తుందో, ఆ తర్వాత సైన్యంలో చేరకుండా మినహాయింపు లభిస్తుందో లేదో తెలియదు. అరకాన్ ఆర్మీ సిట్వే వైపు, అతను ఉంటున్న శిబిరం వైపు వస్తే మహ్మద్ ఇబ్బందులో పడొచ్చు.

ఆయన ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకుంటున్నారు. కళ్లముందు జరిగిన వాటిని చూసిన తర్వాత నిద్రపట్టడం లేదని అంటున్నారు.

Advertisement

“మళ్లీ ఫోన్ చేస్తారేమోనని భయంగా ఉంది. ఇప్పుడు ఏదో అదృష్టవశాత్తూ తిరిగొచ్చాను. కానీ, మళ్లీ వెళ్లాల్సి వస్తే ఏం జరుగుతుందో నా ఊహకు అందడం లేదు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version