International

రిషి సునాక్ పార్టీకి ఓటమి తప్పదా? బ్రిటన్​లో లేబర్​ పార్టీకే ప్రజల మద్దతు!- ప్రభుత్వంపై అసంతృప్తి!! – UK Elections 2024

Published

on

UK Elections 2024 Poll Survey : ఐదేళ్ల తర్వాత తొలిసారి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈసారి కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందనే అంచనాలు అధికార పక్ష నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. 14ఏళ్లుగా యూకేలో కన్జర్వేటివ్‌ పార్టీనే అధికారంలో ఉంది. కానీ వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పెద్దగా నెరవేర్చలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు అధికారం చేపట్టిన కన్జర్వేటివ్‌ పార్టీ మరో మూడు ఎన్నికల్లోనూ గెలిచింది. అయితే ఈ కాలంలో యూకే ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, వరుస కుంభకోణాలు విమర్శలకు తావిచ్చాయి. కన్జరేటివ్‌ పార్టీ నేతలను సాధారణంగా టోరీలు అని పిలుస్తారు. సర్‌ కీర్ స్టార్మర్‌ నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం లేబర్‌ పార్టీ ఒపీనియన్ పోల్స్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీకంటే చాలా ముందుంది. మార్పు అనే ఒకే నినాదంతో లేబర్‌ పార్టీ ఎన్నికల ప్రచారం చేస్తూ దూసుకుపోతోంది.

అధికార పార్టీపై విమర్శలు
రిషి సునాక్ సహా గత ప్రధానుల కాలంలో జీవన ప్రమాణాలు ఖరీదుకావడం యూకేలో అతిపెద్ద సమస్యగా మారింది. అధికార పార్టీ ఇమిగ్రేషన్ విధానంపై విమర్శలు చేస్తున్న “ది న్యూ రిఫార్మ్‌ పార్టీ” మితవాద కన్జర్వేటివ్‌ల ఓట్లను లాగేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ ఆశ్రయం కోరుతున్న వారు, ఆర్థిక పరిస్థితి బాగోలేని వేలాది మంది శరణార్థులు ఇటీవల సంవత్సరాల్లో ఇంగ్లీష్ ఛానల్ మీదుగా చిన్నబోట్లలో యూకేలో ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ సరిహద్దులపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందనే విమర్శలు పెరిగిపోయాయి. అయితే అక్రమంగా వచ్చేవారిని సిగ్నేచర్ పాలసీ పేరుతో రువాండాకు తరలించే ప్రణాళికను కన్జర్వేటివ్‌లు ప్రకటించారు. కానీ ఆ పాలసీ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, అమానవీయమని, యుద్ధభయంతో పారిపోతున్న శరణార్థులకు అవి పరిష్కారం చూపవనే వాదన వినిపిస్తోంది. యూకే ప్రధాని రిషి సునాక్‌ శరణార్థుల బోట్లను ఆపి రువాండా పంపుతామని హామీ ఇచ్చినా ఇప్పటివరకూ అమలు చేయలేదని విమర్శకులు చెబుతున్నారు.

ముందస్తు ఎన్నికలు
యునైటెడ్ కింగ్‌డమ్ దిగువసభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో 650స్థానాలకు ఒకేసారి జులై4న ఎన్నికలు జరగనున్నాయి. జులై 4న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించి రాజకీయ పండితులను, సొంత ప్రజాప్రతినిథులను రిషి సునాక్ ఆశ్చర్య పరిచారు. వాస్తవంగా మరో మూడు నెలల తర్వాతే ఎన్నికలు జరుగుతాయని అంతా అంచనా వేశారు. సునాక్‌ ఓటమి ఖాయమని పరిశీలకులు చెబుతుంటే ఆర్థిక వ్యవస్థపై సానుకూల వార్తలు కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దోహదం చేస్తాయని ప్రధాని రిషి భావిస్తున్నారు. యూకేలో కన్జర్వేటివ్ పార్టీ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లోనూ అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. మూడు దశాబ్దాలుగా కన్జర్వేటివ్ పార్టీకి పట్టంకట్టిన కాట్స్‌వోల్డ్స్‌ ప్రాంత ఓటర్లు ఈసారి మార్పును కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.

14 ఏళ్ల తర్వాత మొదటిసారి
బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీని గెలిపించగలరా అని సందేహాలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆయన అనుసరించిన వైఖరే ఇందుకు కారణం. ఎన్నికలు జులై 4న జరుగుతాయని పందెం కాసిన సొంత పార్టీ నాయకులను ఆయన సస్పెండ్‌ చేయడం ప్రతికూలంగా మారింది. జూన్‌ 6న ఫ్రాన్స్‌లోని నార్మండీలో జరిగిన డి-డే ఉత్సవ కార్యక్రమం నుంచి సునాక్‌ త్వరగా వెళ్లిపోవడం అమరవీరుల త్యాగాలను అగౌరవపరచడమేనని విమర్శలు వచ్చాయి. ఆయన క్షమాపణ చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్‌ పార్టీ రేటింగ్‌లు కూడా బాగా పడిపోయాయి. 14 ఏళ్ల తరవాత తొలిసారి కన్జర్వేటివ్‌ పార్టీ ఓడిపోతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version