Cricket
RCB Fans : ఒక్క మ్యాచ్ గెలవగానే.. ఐపీఎల్ ఫైనల్ తేదీ మార్చాలని ఆర్‌సీబీ ఫ్యాన్స్ పట్టు.. కారణం తెలిస్తే షాకే?
RCB : ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సీజన్‌లో రెండో విజయాన్ని బెంగళూరు నమోదు చేయడమే అందుకు కారణం. గురువారం ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఆర్‌సీబీ గెలుపొందింది. ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటిన తరుణం ఈ విజయంతో రేసులోకి వచ్చింది ఆర్‌సీబీ. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచులు ఆడగా రెండు మ్యాచుల్లోనే గెలుపొందిన ఆర్‌సీబీ మిగిలిన మ్యాచుల్లో గెలిచి కాస్త అదృష్టం తోడైతే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవచ్చు.
ఈ క్రమంలో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ప్రస్తుతం ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చాడు. ఐపీఎల్ ఫైనల్ తేదీని ఖచ్చితంగా మార్చాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 26న జరగాల్సి ఉంది. అయితే.. ఒక రోజు ముందుగా అంటే మే 25న నిర్వహించాలని పట్టుబడుతున్నారు. అలా చేస్తే తమ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుస్తుందని వారు అంటున్నారు. ఇందుకు ఓ లాజిక్‌ను చూపెడుతున్నారు.
వాస్తవానికి ఆర్‌సీబీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గెలిచింది. మార్చి 25న పంజాబ్‌తో ఏప్రిల్ 25న సన్‌రైజర్స్ హైదారాబాద్ పై విజయాలను సాధించింది. అంటే.. ప్రతి నెలలో 25వ తేదీన ఆర్‌సీబీ ఖచ్చితంగా గెలుస్తోంది. ఈ లెక్కన ఐపీఎల్ ఫైనల్ ను మే 25న నిర్వహించాలని అంటున్నారు. దీన్ని చూసిన కొంత మంది ఆర్‌సీబీ ఫ్యాన్స్ అంటున్న దానిలో న్యాయం ముంది అని అంటుంటే.. ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ముందు ఫ్లే ఆఫ్స్‌కు చేరుకోవాలి గదా అంటూ మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రజత్ పాటిదార్ (50; 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) లు అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. ఆర్‌సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్ తలా రెండేసి వికెట్లు తీశారు. విల్ జాక్స్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Next win for @RCBTweets will be on May 25, @IPL pls reschedule one of #RCB matches on this date https://t.co/NgvceoCJdh
— M Anil Kumar (@AniltheMatrix) April 26, 2024