Spiritual
Rath Yatra 2024: రథయాత్రకు సర్వం సిద్ధం.. 53 ఏళ్ల తర్వాత పూరీలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం
విశ్వ ప్రసిద్ది పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి దేవీ సుభద్రలు అధిరోహించే రథాలు నందిఘోష్, తాళధ్వజ, దర్పదశళన్ తయారీ పనులు పూర్తయ్యాయి. ఈ రథాలపై ఆకర్షణీయమైన పార్శ్వదేవతలు, చండీ చాముండి, సప్తరుషులు, శక్తుల విగ్రహాలను అమరిక, అలంకరణలో చిత్రకార్, రూపకార్, దర్జీ సేవాయత్‌లు తలమునకలై ఉన్నారు. వస్త్రాలంకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే శనివారం సాయంత్రంలోగా మూడు రథాలను శ్రీక్షేత్రం ఎదుట నిలుపుతారు. ఆదివారం రథయాత్ర కావడంతో భక్తులు, సందర్శకులు పూరీకి భారీగా తరలివస్తున్నారు. మఠాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా చీకటి ( ఒనొసొనొ) మందిరంలో కోలుకున్న జగన్నాథునికి సేవాయత్‌లు, ఇతరగోప్యసేవలు నిర్వహిస్తున్నారు. పురుషోత్తముడు, బలభద్రుడు, సుభద్రలకు శుక్రవారం ‘బొనొకొలగి’ సేవ జరిగింది. ఇందులో భాగంగా ఆకుపసర్లు, బెరళ్లు, మూళికాచూర్ణాలు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన రంగులను దివ్యవిగ్రహాలను అలంకరించారు. జ్వరం నుంచి కోలుకున్న జగన్నాథ స్వామికి పంచామృతం, చొకొటా, జున్ను, పాలు, పండ్లను నివేదించారు. ఒనొసొనొ మందిరంలో గోప్యసేవలు ముగింపు దశకు చేరుకోగా.. శనివారం అర్ధరాత్రి తర్వాత నవయవ్వన రూపం ఉంటుంది. తర్వాత నేత్రోత్సవం, రథయాత్ర సేవలు ప్రారంభం కానున్నాయి.
సాధారణంగా జగన్నాథుడి ఉత్సవాల్లో రథయాత్రకు ముందు రోజు నవయవ్వన రూపం, నేత్రోత్సవం జరుగుతుంది. కానీ, ఒకే రోజు మూడు ఉత్సవాలను నిర్వహించడం అరుదు. చివరిసారిగా 1971లో ఒకేరోజు జగన్నాథస్వామి నవయవ్వన రూపం, నేత్రోత్సవం, రథయాత్ర జరిగాయి. మళ్లీ ఆ నాటి పరిస్థితి పునరావృతమైంది. శనివారం (జులై 6న) అర్ధరాత్రి నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థామూర్తుల)కు సేవలు మొదలవుతాయి. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి పురుషోత్తముని నవయవ్వన అవతారం అలంకరణ ఉంటుంది.
అనంతరం రత్నసింహాసనంపై ఉదయం 7.30 గంటలకు నేత్రోత్సవం జరిపి, గోప్య సేవలు చేపడతారు. తర్వాత ఉదయం 11 గంటలకు రథాలపై విగ్రహాలను ప్రతిష్ఠింపజేస్తారు. పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ బంగారు చీపురు పట్టి రథాలు ముందు ఊడ్చుతారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే రథాలకు అశ్వాలు, సారథులను అమర్చిన తర్వాత గుండిచా మందిరంవైపు ప్రయాణిస్తాయి.