Telangana

అరుదైన పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారుడు.. తెలంగాణ నుంచే ఎందుకంటే..

Published

on

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, కంచిపట్టు చీరలకు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి కేరాఫ్ అడ్రస్. చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక ఇక్కడి ఈ చీరలు. సృజనాత్మకత, నూతన డిజైన్లతో వస్త్రాల తయారీ ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపానికి నిదర్శనం. ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణహితంగా చీరను రూపొందించి మరోసారి జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను ఓ కళాకారుడు చాటిచెప్పారు.

యాదాద్రి జిల్లా చేనేత కార్మికులకు పుట్టినిల్లు..
ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపాలు ఖండాంతర ఖ్యాతిని సాధించాయి. ఈ ప్రాంతంలోని నేతన్నలు ఎన్నో చేనేత పురస్కారాలను అందుకున్నారు. తాజాగా ఓ చేనేత కార్మికుడు పర్యావరణహితమైన చీరను రూపొందించి.. జాతీయస్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను చాటాడు. చౌటుప్పల్ మండలం కొయ్యల గూడెంకు చెందిన కర్నాటి ముఖేశ్ ఈ అరుదైన నేతను నేసాడు. కేంద్ర చేనేత, జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని జాతీయ పురస్కారానికి ఎంపిక చేయగా.. వారిలో తెలంగాణ నుంచి ముఖేశ్ ఈ అవార్డు సాధించారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివిన ముఖేశ్ బాల్యం నుండి తాత, తండ్రి వారసత్వంగా చేనేత వృత్తిని కొనసాగించారు. 15 ఏళ్లుగా ముఖేష్ పలు ప్రయోగాలను చేస్తూ ఈ రంగంలోనే ఉన్నారు. ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే జాతీయ పురస్కారానికి రాష్ట్రం నుంచి 27 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరిలో ముఖేష్ ఒక్కరే రాష్ట్రం నుంచి జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యాడు.

పర్యావరణహితమైన చీర..
కర్నాటి ముఖేష్ రెండేళ్లపాటు శ్రమించి ప్రకృతి నుంచి సేకరించిన పది రకాల రంగులు అద్ది, వందపూల డిజైన్లతో ప్రత్యేకంగా నేసిన డబుల్ ఇక్కత్ ప్రకృతి రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. నాణ్యమైన పత్తితో తయారైన సన్నటి నూలు దారాన్ని చీర తయారీకి ఉపయోగించారు. నూలును ఆయుర్వేద గుణాలున్న కరక్కాయ పొడి, కుంకుడుకాయ రసంతో శుద్ధిచేశారు. మగ్గంపై పడుగు, పేక ఒక్కో పోగును అల్లుతూ రెండేళ్లు శ్రమించి 46 అంగుళాల వెడల్పు, ఏడు మీటర్ల పొడవుతో 600 గ్రాముల బరువుండే చీరను నేశారు. కర్నాటి ముఖేష్ చేనేత ఇక్కత్ చీరల తయారీలో నూతన ఆవిష్కరణల కోసం నిరంతరం ప్రయత్నిస్తుండేవాడు. 2022లో రాష్ట్రప్రభుత్వం నుంచి కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఈ జాతీయ చేనేత పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. తెలంగాణ నుంచి జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు కర్నాటి ముఖేష్ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపిక కావడం పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version