International

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

Published

on

Yunus Comments On Hasina : బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్‌ యూనస్‌, మాజీ ప్రధాని షేక్‌ హసీనాను ఉద్దేశించి ‘మాన్‌స్టర్‌ వెళ్లిపోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన ఆయన విద్యార్థులతో సమావేశమయ్యారు. ఆందోళనలను ముందుండి నడిపించిన విద్యార్థి సంఘాల నాయకులను ప్రశంసించారు. ఇప్పటికే విద్యార్థి సంఘం నాయకులు నహిద్‌ ఇస్లాం, ఆసిఫ్‌ మహ్మద్‌లను 16 మంది సభ్యుల సలహా మండలిలో చేర్చుకున్నామని ఆయన అన్నారు.

“విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన విప్లపం మొత్తం ప్రభుత్వాన్నే కూల్చేసింది. నిరంకుశ పాలనకు ముగింపు పలికింది. దేశం నుంచి మాన్‌స్టర్‌ (రాక్షసి) వెళ్లిపోయింది. మిమ్మల్ని నేను గౌరవిస్తాను. మీరు తాత్కాలిక పరిపాలన బాధ్యతలు తీసుకొమ్మని కోరినందు వల్లే అంగీకరించాను’’ అని ముహమ్మద్ యూనస్​ పేర్కొన్నారు.

ప్రధాన న్యాయమూర్తిగా సయ్యద్ రెఫాత్ అహ్మద్ పేరును విద్యార్థి నాయకులు ప్రతిపాదించడంతో ఆయనను కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు ముహమ్మద్ యూనస్​.

అదుపులోకి మాజీ మంత్రులు
బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీశాఖ మాజీ మంత్రి జునైద్‌ అహ్మద్‌ పలక్‌ను, విదేశాంగ మాజీ మంత్రి హసన్‌ మహమూద్‌ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌ సైన్యంలో మేజర్‌ జనరల్‌గా ఉన్న జియావుల్‌ అహ్‌సాన్‌పై కూడా ప్రభుత్వం వేటువేసింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ మహమ్మద్‌ సైఫుల్‌ అలాంను విదేశాంగ మంత్రిత్వశాఖకు బదిలీ చేశారు. హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.

మా ప్రమేయం లేదు : అమెరికా
బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడానికి, మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి వదిలేసి, దేశం వదిలి వెళ్లడానికి అమెరికానే కారణమంటూ వస్తున్న ఆరోపణలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ఖండించారు. బంగ్లాదేశ్‌ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. తమపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.

Advertisement

“బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో అమెరికా ప్రమేయం లేదు. బంగ్లా అంతర్గత వ్యవహారాల్లో యూఎస్ ప్రమేయం ఉందని వచ్చిన వార్తలు, నివేదికలు తప్పు. అందులో ఎలాంటి నిజం లేదు. వారి నాయకుడిని ఎంచుకోవడం బంగ్లాదేశ్​ ప్రజల ఇష్టం. బంగ్లాదేశ్​ ప్రజలే వారి ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటారు. అక్కడి పరిస్థితులను అమెరికా పర్యవేక్షిస్తుంది. అధ్యక్షుడు జో బైడెన్ బంగ్లాదేశ్​లో ఉన్న హిందువుల మానవ హక్కుల సమస్యలపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు” అని వైట్​హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version