International

రగులుతున్న పశ్చిమాసియా.. దాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌.. ఇరాన్‌కు వార్నింగ్

Published

on

Iran Israel war : పశ్చిమాసియా రగులుతోంది.. ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. నువ్వు ఒక్కటిస్తే.. నేను రిటర్న్‌ గిఫ్ట్‌గా రెండు ఇస్తానంటోంది ఇజ్రాయెల్‌. తమ భూభాగంలో జరిగిన డ్రోన్‌ దాడులతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌.. ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది.

పశ్చిమాసియాలో రోజు రోజుకీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ దాడి జరపడాన్ని ఇజ్రాయెల్‌ జీర్ణించుకోవడం లేదు. ఇరాన్‌ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్‌పై ప్రతిదాడి తప్పదని.. ఇందుకోసం ‘ఆపరేషన్‌ ఐరన్‌ షీల్డ్‌’ చేపడతామని ఇజ్రాయెల్‌ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జి హలేవి స్పష్టం చేశారు. తమ వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్‌ భావించిందని ఆయన మండిపడ్డారు. ‘ఐరన్‌ షీల్డ్‌’ ఆపరేషన్‌కు తాము సిద్ధమవుతున్నామన్నారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఈ నెల 13న 300కుపైగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి పాల్పడింది. అయితే ఇజ్రాయిల్‌పై దాడిని మిత్రదేశాలైన అమెరికా, బ్రిటన్‌, జోర్డాన్‌ అడ్డుకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రతిదాడి విషయంలో తాము ఇజ్రాయెల్‌ను నిర్దేశించలేమంటున్న అమెరికా.. నచ్చిన నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందంటోంది. మరోవైపు అగ్రరాజ్యం అండగా నిలిచినా నిలవకపోయినా.. ఇరాన్‌పై ప్రతిదాడి విషయంలో ముందుకే వెళ్లాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సహా మంత్రిమండలిలో ఎక్కువ మంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌కు చెప్పినట్లు సమాచారం.

ఇరాన్‌ విషయం తేలేవరకు గాజాలోని రఫాపై ఆపరేషన్‌ను నిలిపివేయాలని నెతన్యాహు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతిదాడికి ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్‌ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సంయమనం పాటించాలని ఇరుపక్షాలకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ విజ్ఞప్తి చేశారు.

ఇజ్రాయెల్‌పై దాడి సమాచారాన్ని అమెరికాకు 72 గంటలకు ముందే తెలిపామని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి హసేన్‌ అమీర్‌ అబ్దుల్ల్లా హియాన్‌ అన్నారు. పౌర లక్ష్యాలపై తాము గురిపెట్టలేదన్న ఆయన.. ఇజ్రాయెల్‌ను శిక్షించేందుకు, తమని రక్షించుకునేందుకు తీసుకున్న చర్య అన్నారు. దీని గురించి తాము ముందుగానే అమెరికాకు సమాచారం ఇచ్చామన్నారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని అమెరికా తెలిపింది. మరోవైపు ఇరాక్‌, తుర్కీయే, జోర్డాన్‌ అధికారులు మాత్రం తమకు ముందస్తు సమాచారం ఇరాన్‌ నుంచి అందిందని తెలిపారు.

Advertisement

ఇరాన్‌ దాడి సమయంలో తాము ఇజ్రాయెల్‌కు సాయం చేశామని సౌదీ అరేబియా సైతం తెలిపింది. తమ గగనతలంపైకి వచ్చిన డ్రోన్లను, క్షిపణులను నేలకూల్చామని సౌదీ అరేబియా తెలిపింది. మరోవైపు అమెరికా, ఇండియా, యూకేతో పాటు పలు దేశాలు ఇరాన్‌పై ప్రతీకార దాడులతో పరిస్థితులను తీవ్రతరం చేయవద్దని ఇజ్రాయెల్‌ను కోరుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version