Andhrapradesh
రాజకీయ పార్టీల సభలకు ఆర్టీసీ బస్సులను ఫ్రీగా ఇవ్వం: ఏపీ మంత్రి మండిపల్లి
రాజకీయ పార్టీల సభలకు ఆర్టీసీ బస్సులను ఫ్రీగా వాడబోమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం కుప్పంలో కొత్తగా 5 ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుప్పం బస్టాండ్, బస్ డిపోలో ఆధునీకరణకు చర్యలు చేపడతామన్నారు. కుప్పం నుంచి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయని తెలిపారు.
ప్రభుత్వంలో ఏపీఏస్ ఆర్టీసీని 100 శాతం విలీనం చేసేందుకు కృషి చేస్తామని.. కుప్పం డిపోలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీజిల్ రేట్లు తగ్గినా కూడా బస్సు చార్జీలు పెంచిన ఘనత జగన్ ప్రభుత్వానిదని విమర్శించారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదన్నారు. శాఖల్లో ఎదైన అవినీతి జరిగి ఉంటే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆర్టీసీ స్థలాలు దోచుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతోందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూస్తామన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పరిస్థితిని అధ్యయనం చేసి.. లోటుపాట్లు గుర్తించి తదనుగుణంగా ఏపీలో అమలు చేస్తామని చెప్పారు. కాగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ హామీయిచ్చిన సంగతి తెలిసిందే.