National

పోలవరం గుడ్ టైం స్టార్ట్ – ‘ప్రాజెక్టు బాధ్యతంతా మాదే – నిధులిచ్చి పూర్తి చేస్తామన్న కేంద్రం’ – CENTRAL GOVT FUNDS TO POLAVARAM

Published

on

Centre Financial Support to Polavaram Project : ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం తేల్చిచెప్పడంతో ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని, అవసరమైన నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పోలవరానికి పెద్ద భరోసా దక్కింది. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదని యావద్దేశానికి ఆహార భద్రత అందించే కీలక ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఆశలకు కేంద్రం ఊపిరి పోసింది.

జాతీయ ప్రాజెక్టుపై తొలగిన నీలినీడలు : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చే విషయంలో ఏడెనిమిదేళ్లుగా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే పునరావాసం, భూసేకరణ కోసమే 33 వేల కోట్లు అవసరమవుతాయని 2017-18లోనే తేల్చారు. ఈ నిధులు ఇచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేసింది. ఒకానొక దశలో పునరావాసం, భూసేకరణలతో తమకు సంబంధం లేదని వాదించింది. నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, సీఎం చంద్రబాబు మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.

2013-14 ధరలతో నీటిపారుదల విభాగానికయ్యే వ్యయం 20,398 కోట్లు రూపాయలు మాత్రమే ఇస్తామని, అంతకు మించి ఇవ్వబోమని కేంద్రం చెబుతూ వచ్చింది. 2020 అక్టోబరులోనూ దీనిపై కేంద్ర ఆర్థికశాఖ కొర్రీ వేసి ఆ నిధులే ఇస్తామంటూ పేర్కొంది. ఇప్పటి వరకు తాజా డీపీఆర్​ ఆమోదం పొందకపోవడంతో ఈ అంశంలో అనుమానాలు అలానే ఉన్నాయి.

నిధులు ఎప్పటి నుంచో పెండింగ్​ : పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే ఆమోదం పొందిన డీపీఆర్​ స్థాయి దాటి నిధులు ఖర్చు చేయడంతో కేంద్రం ఆ మొత్తం ఇవ్వడం లేదు. కొత్త డీపీఆర్​కు ఆమోదం లేకపోవడంతో 2000 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు ఎప్పటి నుంచో పెండింగులో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం 2017-18 ధరలతో రూ. 55,548.87 కోట్ల రూపాయలతో రెండో డీపీఆర్​కు ఒక దశ ఆమోదం సాధించింది. ఆ తర్వాత కేంద్రం రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అనేక దశల్లో పరిశీలించి 2020లో రూ. 47,725.47 కోట్ల రెండో డీపీఆర్​కు ఆమోదం తెలియజేసింది. ఆ తర్వాత 2020లోనే కేంద్ర ఆర్థిక శాఖ రూ.20,398.81 కోట్లే ఇస్తామంటూ లేఖ రాయడంతో రాష్ట్రం గుండెల్లో రాయిపడింది.

తొలిదశ పేరుతో కొత్త డీపీఆర్​ సమర్పించాలని కేంద్రం సూచించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. తొలిదశలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెడితే పునరావాసానికి ఎంత ఖర్చవుతుందో, ఆ మొత్తానికి నిధులు ఎంత అవుతాయో చెప్పాలని కోరింది. ప్రస్తుతం రూ.30,436.95 కోట్లకు పోలవరం తొలిదశ పూర్తి చేసేలా దాదాపు అన్ని స్థాయిల్లో ఆమోద ప్రక్రియ పూర్తయింది. కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే ప్రాజెక్టు తొలిదశకు మరో డీపీఆర్​ ఆమోదించినట్లవుతుంది. తక్షణమే రూ.12,157 కోట్లు అందుబాటులోకి వస్తాయి.

Advertisement

తొలగిన సందేహలు : 2013లో కొత్త భూసేకరణ చట్టం వచ్చింది. దాని ప్రకారం పోలవరం ప్రాజెక్ట్​కు భూసేకరణ వ్యయం, పునరావాస వ్యయం పెరిగిపోయాయి. ఈ రెండింటికే 33 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. దీంతో 2017-18 ధరల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం 55,457 కోట్ల రూపాయలకు రెండో డీపీఆర్​ను పంపింది. దీనికి సాంకేతిక సలహా కమిటీ ఆమోదం దక్కినా కేంద్ర మంత్రిమండలి ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇస్తుందా లేదా, ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న సందేహాలు తొలగిపోలేదు. ఇన్నాళ్లుగా రెండో డీపీఆర్‌ అంశం కేంద్రం తేల్చనేలేదు. అలాంటి సంక్షుభిత పరిస్థితుల్లో తాజాగా మంగళవారం నాటి కేంద్ర బడ్జెట్‌తో పోలవరంపై కమ్ముకున్న అనుమానపు మేఘాలన్నీ తొలగిపోయాయి.

“పోలవరం జాతీయ ప్రాజెక్ట్​. దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉంటుంది. 2014లో కేబినేట్​ ఆమోదం తీసుకొని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్​కు కాబినేట్​ నిర్ణయాల ప్రకారం ఎంత నిధులు ఆమోదం పొందితే అంత ఇస్తూ వచ్చాం. ఈ క్రమంలో కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిని రాష్ట్రం ప్రభుత్వం చర్చించి, పోలవరం ప్రాజెక్ట్​ను పూర్తి చేస్తాం”_నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

అవసరమైన నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ మరీ ఈ విషయం వెల్లడించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇస్తామని నిర్మలా సీతారామన్​ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version