International
POK విదేశీ భూభాగమేనని ఒప్పుకున్న పాక్- ‘మరి వారికి అక్కడేంటి పని?’ – POK Issue
Pakistan On POK : పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) విదేశీ భూభాగమని పాకిస్థాన్ సర్కార్ ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. అక్కడ పాకిస్థాన్ చట్టాలు చెల్లబోవని చెప్పింది. పాత్రికేయుడి కిడ్నాప్ కేసుపై శుక్రవారం విచారణ సందర్భంగా పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ ఇస్లామాబాద్ కోర్టులో ఈ మేరకు వ్యాఖ్యానించారు. రావల్పిండిలోని తన ఇంట్లో ఉన్న అహ్మద్ ఫర్హద్ షా అనే పాత్రికేయుడిని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ మే 15న కిడ్నాప్ చేసింది. దీనిపై ఆయన భార్య ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పీఓకేలో పాకిస్థాన్ రాజ్యాంగం చెల్లదు!
ఈ పిటిషన్‌పై జస్టిస్ మోసిన్ అక్తర్ కయాని నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అహ్మద్ ఫర్హద్‌ను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఆ సమయంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అదనపు అటార్నీ జనరల్. ప్రస్తుతం అహ్మద్ పీవోకేలో పోలీస్ కస్టడీలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. అది విదేశీ భూభాగమని చెప్పారు. అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలు ఉంటాయని, పాకిస్థాన్ చట్టాలు చెల్లబోవని చెప్పారు. అందువల్ల అతడిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టడం కుదరదని వివరించారు.
‘విదేశీ భూభాగమైతే అక్కడ మీకేంటి పని?’
దీనిపై జస్టిస్ కయానీ ధర్మాసనం స్పందించింది. ఒకవేళ పీవోకే విదేశీ భూభాగమైతే పాకిస్థాన్ రేంజర్లు, పాక్ మిలటరీ ఎందుకు ఆ ప్రాంతంలోకి చొరబడుతున్నారని చురకలంటించింది. సామన్యులను విచారణ పేరుతో ఇంటెలిజెన్స్ సంస్థలు బలవంతంగా నిర్బంధించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.
భారత్‌కు మరింత బలం
మరోవైపు పాక్ న్యాయవాది వ్యాఖ్యలతో భారత్‌కు మరింత బలం చేకూరినట్లయింది. పీవోకే భారత్‌లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. పీవోకే ఎప్పటికీ భారత్‌తోనే ఉంటుందని, అది భారత్‌లోనే ఉంటుందని వివిధ సందర్భాల్లో ఆయన తెలిపారు. ఇటీవల పీఓకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని తమను బెదిరించాలని చూస్తోందని మండిపడ్డారు. తాము మోదీ సేవకులమని, అణుబాంబులకు భయపడమని అన్నారు.