International
PM Modi: భూటాన్ ప్రధానికి మోదీ సాదర స్వాగతం.. ఇరు దేశాల మధ్య..
ఐదు రోజుల పర్యాటనలో నేపథ్యంలో భూటాన్ ప్రధాని శేరింగ్ టోబ్‌గే భారత్‌కు చేరుకున్నారు. మార్చి 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌కు చేరుకున్న భూటాన్ ప్రధానికి కేంద్ర మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం భూటాన్ ప్రధాని శేరింగ్ టోబ్‌గే భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతరం టోబ్‌గే రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు.
ఇక అంతకు ముందు భూటాన్ ప్రధానికి స్వాగతం పలికిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు టోబ్‌గే పర్యటన నిదర్శనమన్నారు. టోబ్‌గే తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా ముంబైలో కూడా పర్యటించనున్నారు. భూటాన్ ప్రధానమంత్రి పర్యటన ఇరు పక్షాలకు తమ ప్రత్యేక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించడానికి, రెండు దేశాల మధ్య శాశ్వతమైన స్నేహం, సహకార సంబంధాలను విస్తరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా గడిచిన జనవరిలో భూటాన్‌లో మూడు రోజుల అధికారిక పర్యటన చేపట్టారు. ఆ సమయంలో వినయ్ భూటాన్ ప్రధానితో సమావేశమైన విషయం తెలిసిందే.