Political
PM Modi South Tour: దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని మోదీ ఫుల్ ఫోకస్ .. 5 రోజుల పాటు ఇక్కడే మకాం!
లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ప్రారంభించింది. ఎన్‌డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటు, వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. దక్షిణ భారతంలో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకపోవడం, విజయాలను రుచి చూడకపోవడంతో ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ప్రధాని మోదీ మార్చి15 నుంచి 19 వరకు ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు సుడిగాలిలా పర్యటించి ప్రజలకు చేరువకానున్నారు. మిషన్ సౌత్‌లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి పలు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు మోదీ.
తొలుత మార్చి 15న తమిళనాడు సేలంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. అదే రోజు కేరళ పాలక్కాడ్‌లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. మార్చి 16న కన్యాకుమారిలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తెలంగాణలోని జహీరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే అదేరోజు సాయంత్రం ఏపీలోని విశాఖకు వెళ్లనున్నారు. టీడీపీ-జనసేన కూటమి నిర్వహించే సభకు హాజరుకానున్నారు.
మార్చి 17న ఉదయం కేరళ వెళ్లి పథనంథిట్టంలో జరిగే సభకు హాజరవుతారు ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం తెలంగాణలోని మల్కాజిగరిలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. ఆదే రోజు సాయంత్రం గుంటూరులో టీడీపీ-జనసేన-బీజేపీ నిర్వహించే బహిరంగలో సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక మార్చి 18వ తేదీన కర్ణాటకలోని బీదర్, 19న తెలంగాణలోని నాగర్ కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించే సభల్లో పాల్గొంటారు ప్రధాని మోదీ.
మొత్తంగా సౌత్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. ఒక రాష్ట్రంలో పర్యటన పూర్తి చేసి, మరో రాష్ట్రానికి వెళ్లాలన్న విధానం కాకుండా ఒకేరోజున పక్కపక్క రాష్ట్రాల్లో సభలు ఉండేలా ప్రణాళికను రూపొందించారు. ఇందుకు తగ్గట్టుగానే పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.