Business
ప్లాన్ ధర తగ్గించిన BSNL.. ఇక రూ.49కే సినిమాప్లస్ సబ్‌స్క్రిప్షన్!
BSNL Cinemaplus: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లకు అందించే సినిమా ప్లస్ ఓటీటీ ప్యాకేజీ స్టార్టప్ ధరను తగ్గించింది. ఈ ప్రారంభ ప్యాకేజీ కోసం గతంలో నెలకు రూ.99 వసూలు చేసిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు దానిని రూ.49కి తగ్గించింది. ఈ ప్యాక్ తీసుకుంటే లయన్స్ గేట్, షెమరూమీ, హంగామా, ఎపిక్ ఆన్ ఓటీటీల్లోని కంటెంట్ ఎంజాయ్ చేసేందుకు అవకాశం లభిస్తుంది.
ఇక ఈ రూ.49 స్టార్టప్ ప్లాన్ తో పాటు మరో రెండు ప్యాకేజీలను సైతం అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. జీ5, సోనీలివ్, యప్‌టీవీ, డిస్ని ప్లస్ హాట్ స్టార్‌తో కూడిన ఫుల్ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ కూడా ఉంది. దీని ధర నెలకు రూ.199 గా నిర్ణయించింది బీఎస్ఎన్ఎల్. అలాగే రూ. 249తో బీఎస్ఎన్ఎల్ ప్రీమియం ప్లాన్ సైతం అందిస్తోంది. ఈ ప్యాకేజీలో జీ5, సోనీ లివ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యప్ టీవీ, లయన్స్ గేట్, షెమరూమీ, హంగామా వంటి ఓటీటీలను పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒకే లాగిన్ తో వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఎక్స్ ట్రీమ్ ప్లే పేరిట ఎయిర్ టెల్, జియో టీవి ప్రీమియం పేరిట జియో, టాటా ప్లే బింజ్ తో టాటా సైతం ఈ తరహా ప్యాకేజీలు అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్లు తమకు బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ యాక్సెస్ కావాలనుకుంటే బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ వెబ్‌సైట్ లోకి వెళ్లి తమకు నచ్చిన ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. దీంతో తమ ఫేవరేట్ టీ షోలు, సినిమాలు ఏంజాయ్ చేయవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు అనేవి తమ బ్రాడ్ బ్యాండ్ ఛార్జీల్లో కస్టమర్లకు అందుతాయి. వీటిని ప్రత్యేకంగా ఛార్జ్ చేయదు బీఎస్ఎన్ఎల్.