Spiritual

Phalguna masam: ఫాల్గుణ మాసం ప్రాముఖ్యత ఏంటి?

Published

on

Phalguna masam: మార్చి 11 నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసం విశిష్టత, ఈ సమయంలో ఏ వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందో పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఆదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషమని చిలకమర్తి తెలిపారు.
సర్వదేవతావ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్దానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.

హరిహరసుతుడు అయ్యప్ప స్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతిల జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి “ఫల్గుణ” అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయని చిలకమర్తి తెలిపారు.

పుత్ర సంతానం ఇచ్చే పయోవ్రతం
శ్రీమహా విష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే, అ మాసాన్ని ‘ఫాల్గుణి’గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు ‘పయోవ్రతం’ విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.

Advertisement

సమీపంలోని నదుల్లో స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, విష్ణువును షోడశోపచారాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో రెండు రోజులు వినాయకుడిని ఆరాధిస్తారు. కాశీ, ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి, చతుర్థినాడు అవిఘ్న పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారని చిలకమర్తి తెలియచేశారు.

అమలక ఏకాదశి
దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి, ఆ చెట్టు వద్దనే “అమలక ఏకాదశి” వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని “అమృత ఏకాదశి” గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ, హోలికా పూర్ణిమ, కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి- కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలందుకుంటారు.
ఫాల్గుణ మాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు సంకట గణేశ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి, సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి, అన్నదానం చేస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version