Latest
ఏపీ మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం..!!
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. అందులో భాగంగా వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ఈ భేటీ లో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
కీలక భేటీ
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈనెల 10వ తేది సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరుగనుంది. ఈ మేరకు బుధవారం సిఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ వివిధ శాఖలకు జారీ చేసిన సర్య్కులర్‌లో హెచ్‌ఓడిలు 8వ తేది సాయంత్రం 4 గంటలలోగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నంపోర్టు అభివృద్ది, చెత్త పన్ను రద్దుకు ఆమోదం, పోలవరం, అమరావతి నిర్మాణాలు, ఇంటింటికీ మంచినీటి కుళాయిలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్చ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు పైన చర్చించి నిర్ణయం తీసుకోన్నారు.
హామీల అమలు
సూపర్ సిక్స్ పథకాల అమల్లో సంక్రాంతి నుంచి పి-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, పేదరికంలేని సమాజం ఏర్పాటు దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం లాంటి అంశాలపె కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. సంక్రాంతి నుంచి పీ-4 అమలు పైన ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు. దీపావళి నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమలు పైన మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక, ప్రస్తుతం ఆందోళన బాట పట్టిన వాలంటీర్ల అంశం పైన మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత సమావేశంలోనే వీరికి సంబంధించి చర్చ వచ్చినా..పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఉద్యోగుల అంశాలపై
అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న వేళ మంత్రుల పనితీరు పైన చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక..ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సమావేశం లో పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ తప్పుకుంది. దీంతో..దసరా వేళ కొత్త పీఆర్సీ నియామకం పైన నిర్ణయం చేస్తారని సమాచారం. దీంతో పాటుగా తిరుమల లడ్డూ వివాదంలో చోటు చేసుకున్న పరిణామాల పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది