Andhrapradesh
Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు.. తొలి సంతకం దేనిపైన అంటే..?
ఇట్స్ అఫీషియల్. ఇన్నాళ్లు అభిమానులకు పవర్ స్టార్‌గా, తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్ అయిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం జూన్ 19న జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు.
క్యాంప్ ఆఫీస్‌లో సరిగ్గా ఉదయం 10గంటల 47 నిమిషాలకు తన క్యాంప్ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరించారు పవన్ కల్యాణ్. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇంద్రకీలాద్రి ఆలయ వేదపండితుల ఆశీర్వచనం అందించారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైళ్లమీద పవన్ సంతకాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ అవుతారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్, రెండు ఫైళ్ళపై సంతకాలు చేశారు. మొదటి ఫైల్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు కోసం తొలి సంతకం చేశారు. అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌పై రెండో సంతకం చేశారు.