International

Pakistan: పాక్ ప్రధాని సంచలన నిర్ణయం.. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ

Published

on

Pakistan: గత రెండేళ్లుగా ఆర్థిక, రాజకీయ సంక్షోభం, అంతర్గత ఘర్షణలతో దాయాది దేశం పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. అయితే ఇటీవలె అక్కడ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల వేళ తీవ్ర హింస చెలరేగినా.. ప్రస్తుతం రాజకీయంగా మాత్రం కొంత శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఆర్థికంగా మాత్రం పాక్ తీవ్ర అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వల కోసం ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ముందు అడుక్కుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాక్‌లో ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు. అయితే ఒక్క వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలు తప్ప మిగిలిన వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

పాకిస్థాన్‌ను తీవ్ర ఆర్థిక సమస్యల నుంచి బయట పడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తేల్చి చెప్పారు. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ సంస్థల అంశంపై సమావేశం నిర్వహించిన తర్వాత షెహబాజ్ షరీఫ్ ఈ ప్రకటన చేశారు. అయితే పాకిస్థాన్‌కు దీర్ఘకాలం సాయం అందించేందుకు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్-ఐఎంఎఫ్‌తో సోమవారం చర్చించిన తర్వాత.. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చేయాలన్న పాక్ ప్రధాని నిర్ణయం బయటికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బిజినెస్ చేయడం.. ప్రభుత్వం పని కాదని.. పెట్టుబడులు, వ్యాపారం చేసేవారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వం చేయాల్సిన పని అని పాక్ ప్రధాని వెల్లడించారు. అంతేకాకుండా పాక్‌లోని అన్ని మంత్రిత్వ శాఖలు.. ప్రైవేటీకరణ కమిషన్‌కు సహకరిస్తూ.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

పాకిస్థాన్‌లో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే ప్రైవేటీకరణ చేయాలని.. మొదట అక్కడి ప్రభుత్వం భావించగా.. ఆ తర్వాత మార్చుకుంది. లాభాల్లో ఉన్న సంస్థలైనా.. నష్టాల్లో ఉన్న సంస్థలైనా.. అన్నింటినీ ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించుకుంది. అయితే దేశంలో వ్యూహాత్మకమైన సంస్థలు, కంపెనీలకు మాత్రం ప్రైవేటీకరణ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.

అయితే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని పేర్కొన్న పాక్ సర్కార్.. బిడ్డింగ్ సహా అన్ని ప్రక్రియలను టీవీల్లో లైవ్ ప్రసారాలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే తీవ్ర నష్టాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్.. ప్రైవేటీకరణ ప్రక్రియ తుది దశలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పాక్‌లో మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ నిలిచింది. ఈ సంస్థ అప్పులు తీర్చేందుకు ఆ దేశానికి నెలకు
11,500 కోట్ల పాకిస్థాన్ రూపాయలు అవసరం అవుతున్నాయి.

ఇక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొనసాగుతున్న గత నెలాఖరులో పాకిస్థాన్‌కు మరో 1.1 బిలియన్‌ డాలర్ల అప్పును ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలుపుంది. 3 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై పాకిస్థాన్‌, ఐఎంఎఫ్‌ మధ్య జరిగిన ఒప్పందం ఈ ఏప్రిల్‌తో ముగిసింది. దీంతో చివరి విడతగా రుణాన్ని మంజూరుచేసేందుకు అంగీకారం లభించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే రెండు దశల్లో 1.9 బిలియన్‌ డాలర్లను పాక్‌కు ఐఎంఎఫ్ అందించింది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version