National

పాక్ యుద్ధ విమానం ఎఫ్ 16ను లాక్ చేసి… దాయాదిని వణికించిన కార్గిల్ హీరో

Published

on

కార్గిల్ యుద్ధం ఉధృతంగా సాగుతున్న సమయంలో పాకిస్థాన్ పోస్టులపై మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో భారత సైన్యం విరుచుకుపడింది. ఈ సమయంలో పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించగా.. భారత వైమానిక దళం ముందే పసిగట్టి దానికి తిప్పికొట్టింది. మిరేజ్ రాడార్‌ల సాయంతో ఎఫ్-16లను కొద్ది క్షణాలు పాటు లాక్ చేసి, గగనతలం నుంచి క్షిపణుల ప్రయోగానికి సిద్ధమైంది. దీంతో పాక్ పైలట్లు పలాయనం చిత్తగించారు. 25 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని కార్గిల్ హీరో, రిటైర్డ్ ఎయిర్‌మార్షల్ రఘు నంబియార్ తాజాగా పంచుకున్నారు. ‘పాక్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం ఎఫ్-16ను నేను ఒకానొక సమయంలో 30 సెకెన్ల పాటు లాక్ చేశాను.. అప్పటికి అది 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.. దీంతో పాక్ పైలట్ వెనక్కి వెళ్లిపోయాడు’ అని ఆయన తెలిపారు.

టైగర్ హిల్స్‌లో లేజర్ గైడెడ్ బాంబును ప్రయోగించిన మొట్టమొదటి ఐఏఎఫ్ పైలట్ రఘు నంబియారే కావడం విశేషం. కార్గిల్‌లో పాకిస్థాన్ తీసిన దొంగదెబ్బకు భారత్ ప్రతీకారం తీర్చుకుని.. దాయాది కుట్రలను తిప్పికొట్టింది. కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్లు పూర్తికావస్తోంది.

‘యుద్ధ విమానానికి ఏదైనా ముప్పు ఏర్పడితే దాడి చేసిన వ్యక్తిపై దాడి చేయడం ద్వారా ఆ ముప్పును తిప్పికొట్టాలి” అని టైగర్ హిల్‌పై నాడు భారత్ చేపట్టిన ఆపరేషన్‌లో పాల్గొన్న ఎయిర్ మార్షల్ డీకే పట్నాయక్ (రిటైర్డ్) చెప్పారు. అయితే, ఐఏఎఫ్ పైలట్‌లు దాడిని విరమించుకోవాల్సి వస్తే నియంత్రణ రేఖ వెంబడి గగనతలంలో పాక్ జెట్‌లను వెంబడించవద్దని సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ దాడికి వినియోగించిన మిరేజ్ 2000 యుద్ధ విమానాలకు గాలి నుంచి గాల్లోకి ప్రయోగించే ఫ్రాన్స్‌ తయారీ స్వల్ప శ్రేణి క్షిపణులు మ్యాజిక్-IIలను అమర్చినట్టు తెలిపారు. అలాగే, మిరేజ్ జెట్‌లకు రక్షణగా ఉన్న 530D క్షిపణులు శత్రు విమానాలను సుదూరం నుంచి కూల్చేయగలవని, శత్రు విమానాల రాడార్‌లను జామ్ చేయడానికి రెమోరా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పాడ్‌లను కూడా వాటిని అనుసంధానం చేశామని వివరించారు.

ఈ మిషన్‌లో భాగంగా మోహరించిన ఇతర పైలట్లు నియంత్రణ రేఖ వెంబడి పాక్ వైమానిక దళ కార్యకలాపాలను గుర్తించారు. ఆ సమయంలో పాక్ యుద్ద విమానాలు ఎఫ్ 16లు భారత్ లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. పాకిస్థాన్‌కు కీలకమైన లాజిస్టిక్ ఎయిర్‌బేస్ ముంథో ధలోపై దాడిచేసిన గ్రూప్ కెప్టెన్ శ్రీపాద్ టోకేకర్ (రిటైర్డ్) మాట్లాడుతూ.. ‘మొదట్లో మేము రాడార్ వార్నింగ్ రిసీవర్ ద్వారా F-16లకు సంబంధించిన కదిలికలను గుర్తించాం… వాటిని మనపై దాడికి ప్రయోగిస్తున్నట్టు గ్రహించగలిగాం.. కానీ, మనం మిరేజ్ జెట్‌లతో దాడికి ప్రయత్నించడంతో వారు వెనుదిరిగారు.. ఇలా రెండుసార్లు జరిగింది’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

యుద్ధ విమానంలోని రాడార్ వ్యవస్థలు శత్రు విమానాల నుంచి ముప్పును పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. అలాగే, ప్రత్యర్దుల యుద్ధ విమానాలను కూడా వీటి సాయంతో కొద్ది క్షణాలు నియంత్రించే అవకాశం కూడా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version