Andhrapradesh

ఒంగోలులో కాపు సామాజికవర్గం నేతల కీలక సమావేశం..

Published

on

ఉమ్మడి ప్రకాశంజిల్లాలో కాపు సామాజికవర్గం జనాభా ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ కాపులకు రెండు సీట్లు కేటాయించాలని ఒంగోలులో జరిగిన కాపు సంఘాల సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో ఉమ్మడి ప్రకాశంజిల్లాలోని 12 నియోజకవర్గాలకు చెందిన కాపు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. కాపు సంఘం నేత, జనసేన నాయకుడు ఆమంచి స్వాములుకు గిద్దలూరు నియోజకవర్గం జనసేన టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. స్వాములుకు టికెట్‌ కేటాయించని పక్షంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్దులను నిలబెడతామని హెచ్చరించారు. కూటమిలో కాపు సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించే విషయంలో అన్యాయం జరిగిందని, గుంటూరు నుంచి రాయలసీమ వరకు 40 లక్షల మంది కాపు సామాజిక వర్గం జనాభా ఉంటే ఈ ప్రాంతంలో ఒక్క సీటు కూడా తమకు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి జిల్లాలో 5 లక్షల మంది కాపు సామాజికవర్గ ప్రజలు ఉన్నారరన్నారు. మరోవైపు తనకు గిద్దలూరు జనసేన టికెట్‌ కేటాయిస్తామని పార్టీలో చేరే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ హామీ ఇచ్చారని ఆమంచి స్వాములు తెలిపారు. అయితే పొత్తులో భాగంగా తనకు గిద్దలూరు టికెట్‌ రాకపోవడం వెనుక ఏదో కుట్ర జరిగి ఉంటుందని అనుమానంగా ఉందన్నారు. టిడిపితో పొత్తులో భాగంగా 50 సీట్లు అడిగితే ఇచ్చేవారని, అయితే కొన్ని కారణాల వల్ల కేవలం 24 సీట్లకే పవన్‌కళ్యాణ్‌ పరిమితమయ్యారన్నారు. దాంట్లో కూడా బిజెపి కోసం మరో 3 సీట్లు వదులుకున్నారని, అలాంటి పార్టీ కోసం గిద్దలూరు సీటును టిడిపి వదులుకోలేదా అన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. గిద్దలూరు సీటును తనకు కేటాయించాలన్న సందేశాన్ని పవన్‌ కళ్యాణ్‌కు చేరవేశామని, పవన్‌ ఏవిధమైన నిర్ణయం తీసుకుంటే చివరకు ఆవిధంగా కట్టుబడి పనిచేస్తామని ఆమంచి స్వాములు తెలిపారు.

మరోవైపు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒక్క కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులకు ఒక్క అసెంబ్లీ సీటు కూడా కేటాయించలేదని కాపు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సమర్ధవంతమైన నాయకులు కాపు సామాజిక వర్గంలో లేరనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. కాపు సామాజికవర్గానికి చెందిన సంఘం తరపున ఉమ్మడి ప్రకాశంజిల్లాలో ఎవరికి కష్టం వచ్చినా స్పందించే ఆమంచి స్వాములు కూడా గిద్దలూరులో జనసేన సీటును ఎందుకు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమిలో సమర్దవంతమైన కాపు సామాజికవర్గ నాయకులకు టికెట్లు కేటాయించకుంటే బిజెపి, టిడిపి, జనసేన కూటమి దారుణమైన పరాజయం పాలవుతారని హెచ్చరించారు.

5 నుంచి 10 వేల ఓట్లు ఉన్న రెడ్డి సామాజికవర్గంలోని సోదరులకు రాయలసీమలో టికెట్లు కేటాయిస్తే.. అంతే సంఖ్య ఉన్న కమ్మ సామాజికవర్గం సోదరులకు గుంటూరు, కృష్ణాజిల్లాలో ఎక్కువ సంఖ్యలో సీట్లు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా ఈ సామాజికవర్గాన్ని గుర్తించండని లేకపోతే ఏ పార్టీలకైనా తగిన విధంగా బుద్ది చెబుతామని సంతనూతలపాడు నియోజకవర్గంలో కాపు సామాజికవర్గానికి చెందిన సంఘం నేత కొండపల్లి వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version