Andhrapradesh
మోడ్రన్ టెక్నాలజీతో ఒలింపిక్స్ డ్రోన్ షో- ఒకదానికొకటి ఢీకొట్టకుండా ఎలా ఎగురవేస్తారో తెలుసా? – Paris Olympics 2024 Drone Show
Paris Olympics 2024 Drone Show : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఏర్పాటు చేసిన డ్రోన్ షో సందర్శకులను మంత్రముగ్దుల్ని చేసింది. ఆ కార్యక్రమంలో ఆకాశంలో వేల కొద్ది డ్రోన్లతో ఈఫిల్ టవర్ సమీపంలో ఒలింపిక్ చిహ్నం సహా పలు ఆకృతులను రంగురంగుల కాంతులతో ప్రదర్శించారు. కళ్లు మిరుమిట్లు గొలిపే ఈ డ్రోన్‌షోను చైనాకు చెందిన ఒక టెక్ కంపెనీ నిర్వహించింది. ప్రదర్శనలో కమ్ ఆన్ టీమ్ చైనా అనే పదం తమని ఉత్తేజపరిచినట్లు ఒలింపిక్స్‌కు హాజరైన చైనీయులు ఆనందం వ్యక్తం చేశారు.
భారీ ఎత్తున డ్రోన్లను ప్రదర్శిస్తున్నప్పుడు అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రతి డ్రోన్‌కు కచ్చితమైన స్థానాన్ని కేటాయించటం ఈ ప్రదర్శనలో అత్యంత ముఖ్యమైన అంశం. శాటిలైట్ పోజిషనింగ్‌ను ఉపయోగిస్తే కేవలం మీటరు దూరంలో డ్రోన్లను వాటి స్థానాల్లో ఉండేలా చూడవచ్చు. కానీ ఆ దూరంతో ప్రభావంతమైన అనుభూతిని సందర్శకులకు ఇవ్వలేమని చైనా టెక్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఆ సమస్యను అధిగమించడానికి నైపుణ్యం కలిగిన తమ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. డ్రోన్లు ఎగురుతున్నప్పడు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టకుండా ముందుగా డ్రోన్లను ఎగురవేసి వాటి నమూనాను తీసుకుని దాన్ని మ్యాప్ రూపంలో డ్రోన్లలో నిక్షిప్తం చేస్తామన్నారు. తమ కంపెనీ ఇప్పటివరకు 40 కిపైగా దేశాల్లో వందల సంఖ్యలో డ్రోన్ ప్రదర్శనలను ఇచ్చినట్లు తెలిపారు.
పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జులై 26న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి ఫ్రాన్స్‌లో నదిలో ఆరంభ వేడుకలు చేపట్టారు. సెన్ నది వేదికగా వీటిని నిర్వహించారు. విశ్వ క్రీడలకు వందేళ్ల తర్వాత మళ్లీ ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్, అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసింది. 6 కిలో మీటర్ల పొడవునా 100 పడవల్లో 205 దేశాల క్రీడాకారులు పరేడ్ నిర్వహించారు. ఆరంభ వేడుకల్లో మొత్తం 3వేల మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. 32 క్రీడాంశాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో మొత్తం 329 స్వర్ణ పతకాలు ఉన్నాయి. భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.