National

ఒడిశా సీఎం ఎవరు? ఇంకా వీడని సస్పెన్స్- బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు వాయిదా – Odisha New Government

Published

on

Odisha BJP Government Swearing Ceremony : ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూన్​ 12కు వాయిదా వేశారు బీజేపీ అగ్రనేతలు. ఈ ప్రతిష్టంభన మధ్య సీఎం రేసులో ఉన్న సీనియర్ బీజేపీ నాయకుడు హూటాహుటిన దిల్లీ వెళ్లారు.

తొలుత జూన్ 10న ఒడిశాలో బీజేపీ ప్రభత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు బీజేపీ అగ్రనేతలు. కానీ నరేంద్ర మోదీ తీరకలేకుండా ఉన్నందు వల్లే ఒడిశాలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసినట్లు బీజేపీ నేతలు జతిన్ మెహంతీ, విజయ్‌పాల్ సింగ్ తోమర్‌ తెలిపారు. ఆదివారం కేంద్ర మంత్రివర్గ ప్రమాణం, సోమవారం కొత్త ఎంపీల సమావేశంతో మోదీ బీజీగా ఉన్నారని పేర్కొన్నారు. జూన్​ 11న ఒడిశా బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. దీంతో జూన్​ 12న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుందని ప్రకటించారు.

ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఇంకా సస్పెన్స్‌ వీడకపోగా, సీనియర్‌ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పూజారి దిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రధాన పోటీదారుల్లో ఆయన కూడా ఒకరని సమాచారం. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం అధికారికంగా ఎవరి పేరూ ఇంతవరకు ప్రకటించలేదు.

సీఎం రేసులో ప్రముఖులు
25 ఏళ్ల తర్వాత ఒడిశాకు కొత్త వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కొంతమంది బీజేపీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, మాజీమంత్రి జోయల్‌ ఓరం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు భైజయంత్‌ పండా, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, బాలేశ్వర్ ఎంపీ ప్రతాప్ సారంగి, కాగ్ గిరీశ్ చంద్ర ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. అయితే, ఒడిశా సీఎంగా బీజేపీ కొత్తవారిని పరిచయం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. నవీన్‌ పట్నాయక్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎవరిని తీసుకువస్తుందనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అగ్రనాయకత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version