Andhrapradesh

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

Published

on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు యాజమాన్య కోటా కింద ప్రవేశాలు కల్పించడానికి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ బుధవారం (ఆగస్టు 14) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద గతేడాది ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ఎంబీబీఎస్‌, స్వీమ్స్‌లో ఎంబీబీఎస్‌ సీట్ల ఎన్‌ఆర్‌ఐ కోటాలో ప్రవేశాలు కల్పిస్తారు. నీట్‌ యూజీ – 2024లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 21వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆగస్టు 16 రాత్రి 7 గంటల నుంచి ఆగస్టు18వ తేదీ రాత్రి 9 గంటల వరకూ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ అందుబాటులో ఉండదని వర్సిటీ పేర్కొంది. ఈ వ్యవధిలో కన్వీనర్‌ కోటా కింద ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని పేర్కొంది. ఏపీ ఆన్‌లైన్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ సర్వర్ల మెయింటెనెన్స్‌లో సమస్య వల్ల ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు వివరణ ఇచ్చింది.

యాజమాన్య కోటా సీట్ల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా రూ.10,620 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ.30,620 ఆలస్య రుసుముతో ఆగస్టు 21వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏవైనా సందేహాలు తలెత్తితే 8978780501, 7997710168 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించింది. సాంకేతిక సమస్యలు తలెత్తితే 9000780707 నెంబర్‌ను సంప్రదించాలని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు.

నీట్‌ యూజీ మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా మాత్రమే ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని, మధ్యవర్తులు, దళారుల మాయమాటలు నమ్మొద్దని ఈ సందర్భంగా విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు రాధికారెడ్డి సూచించారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ కాలేజీల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కింద 225 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 95 సీట్ల చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా స్విమ్స్‌లో 23, ఎన్‌ఆర్‌ఐ ప్రైవేట్, మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో 1,078 బీ కేటగిరి, 472 ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. డెంటల్‌ కాలేజీల్లో 489 బీ కేటగిరి, 211 ఎన్‌ఆర్‌ఐ బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version