Telangana

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Published

on

School New Timings : తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులు అనంతరం జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలు మార్చుతూ నిర్ణయించారు. 2022 -23 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యేవి. గత విద్యా సంవత్సరం (2023 -24)లో పాఠశాలల ప్రారంభ వేళలను ఉదయం 9.30గంటలకు మార్చుతూ విద్యాశాఖ నిర్ణయించింది. అయితే, ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9గంటలకే తెరుచుకోనున్నాయి. ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి పనిచేస్తాయి. వాటి పనివేళల్లోనూ మార్పులు చేసే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నట్లు సమాచారం.

వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పున: ప్రారంభం రోజునుంచి స్కూళ్లు టైమింగ్స్ మార్పులు చేయడంపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం స్పందించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ఆయన మోదం తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉదయం 8గంటలకే బస్సులెక్కి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఉదయం 9.30గంటల వరకు స్కూళ్లకు వెళ్లడం లేదు. దీంతో సర్కార్ బడులపై తల్లిదండ్రులకు చులకనభావం ఏర్పడే అవకాశం ఉందని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు తెరుచుకునే సమయాన్ని పాత పద్దతికి తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9.30గంటలకు ప్రారంభమవుతాయి. 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగుతాయి. అయితే, ఉన్నత పాఠశాలల వేళల్లోనూ మార్పులు చేసేందుకు విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పద్దతి ద్వారా సాయంత్రం 4.45గంటల వరకు విద్యార్థులు స్కూళ్లలోనే ఉండాల్సి వస్తుంది. దీంతో వానాకాలంలోనూ, చలికాలంలోనూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వర్షాకాలంలో వర్షాల కారణంగా బాలికలు ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, రక్షణ కరువవుతుందని నిపుణులు చెబుతున్నారని, వీటి పనివేళల్లోనూ త్వరలో మార్పులు చేయడం జరుగుతుందని విద్యాశాఖ అధిరులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version