Career

ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డ్​ ఎగ్జామ్స్- సెమిస్టర్స్ కాదు! – CBSE Board Exam Rules

Published

on

CBSE New Rules For Board Exam : ఇకపై సీబీఎస్ఈ విద్యార్థులు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయనున్నారు! అందకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్-​ సీబీఎస్​ఈని విద్యాశాఖ కోరినట్లు తెలుస్తోంది. 2025-2026 విద్యా సంవత్సరం నుంచి ఈ సరికొత్త విధానాన్ని అమలుచేసేలా వ్యూహరచన చేయాలని సీబీఎస్‌ఈని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ పరీక్షల్లో సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని చెప్పాయి.

వచ్చే నెలలోనే సంప్రదింపులు!
ఏడాదిలో రెండుసార్లు టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చే నెలలోనే సంప్రదింపులు జరపనున్నారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం లేకుండా రెండోసారి బోర్డు పరీక్షలు నిర్వహించేలా అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేసేందుకు విధివిధానాలు రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం.

మార్పులు చేయాలని!
అయితే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌- NCF ముసాయిదా కమిటీ సూచించింది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.కస్తూరిరంగన్‌ సారథ్యంలోని ఈ కమిటీ 11, 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్‌ విధానాన్ని కూడా ప్రతిపాదించింది. ఈ ఫ్రేమ్‌వర్క్‌ను గతేడాది ఆగస్టులో కేంద్ర విద్యామంత్రిత్వశాఖ విడుదల చేసింది.

తప్పనిసరేం కాదు!
ఈ అంశంపై గతేడాది అక్టోబర్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరుకావడం విద్యార్థులకు తప్పనిసరేం కాదని ధర్మేంద్ర ప్రధాన్​ అన్నారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని, తద్వారా విద్యార్థులు తాము సాధించిన ఉత్తమ స్కోరును ఎంచుకోవచ్చన్నారు. కానీ ఇది పూర్తిగా ఐచ్ఛికమే తప్ప తప్పనిసరేం కాదని స్పష్టంచేశారు.

ఇదేం తొలిసారి కాదు!
అయితే, బోర్డు పరీక్షలను సంస్కరించడం ఇదే తొలిసారేమీ కాదు. 2009లో పదో తరగతికి సీసీఈ (కంటిన్యూస్‌, కాంప్రెహెన్సివ్‌ ఎవల్యూషన్‌) విధానాన్ని ప్రవేశపెట్టారు. 2017లో దీన్ని ఎత్తేసి, మళ్లీ పాత విధానాన్నే అమలుచేశారు. కొవిడ్‌ సమయంలోనూ 10, 12 తరగతుల వార్షిక పరీక్షలను ఏడాదికి రెండు విడతలుగా నిర్వహించి తిరిగి పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version