International
నిజ్జర్హత్య కేసు…. మరో అనుమానితుడి అరెస్ట్
anada | వాషింగ్టన్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా (Canada) పోలీసులు మరో అనుమానితుణ్ని అరెస్టు చేశారు. బ్రాంప్టన్ ప్రాంతంలో నివాసముంటున్న అమర్‌దీప్ సింగ్ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు శనివారం అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ కేసులో ఇప్పటికే కరన్ బ్రార్, కమల్ ప్రీత్ సింగ్, కరన్ ప్రీత్ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన వీరు ముగ్గురు ప్రస్తుతం ఎడ్మంటన్ ప్రాంతంలో నివాసముంటున్నారు. మరోవైపు ఈ పరిణామాల వెనక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని భారత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అరెస్టు విషయంలో కెనడా (Canada) కేవలం సమాచారం మాత్రమే ఇచ్చిందని తెలిపింది. అధికారికంగా ఎలాంటి సంప్రదింపులు జరపలేదని పేర్కొంది. వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు కెనడా సర్కారు రాజకీయ వేదిక కల్పించిందని మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసులో దిల్లీపై చేస్తోన్న ఆరోపణలపై ఇప్పటివరకు ఎటువంటి సాక్ష్యాధారాలను, సమాచారాన్ని ఆ దేశం పంచుకోలేదని తెలిపింది.
గత ఏడాది జులై 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో నిజ్జర్ హత్య జరిగింది. దీని వెనక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. వాటిని సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.