Hyderabad
New High Court | రేపు హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన!
New High Court | వ్యవసాయ యూనివర్సిటీ: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. హైకోర్టు భవన నిర్మాణ పనులకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ యూనివర్సిటీ భూములను లాక్కోవద్దని విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు, తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు.
అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు బలగాల నడుమ గుట్టుచప్పుడు కాకుండా పనులు చేపడుతున్నది. రాత్రికి రాత్రే యంత్రాలతో భారీ చెట్లు తొలగించేశారు. రెండు నెలల నుంచి బయోడైవర్సిటీ పార్కుకు నీటి వసతిని నిలిపి వేశారు. దీంతో ఏండ్ల తరబడి పెంచిన చెట్లు కూడా ఎండిపోయాయి. జీవరాసులకు నీటివసతి లేక తమ గూడును మార్చాయి. తాజాగా 10 ఎకరాలలో ఉన్న ఉద్యాన (సపోట), ఔషధ మొక్కలు (లెమన్ గ్రాస్) తొలిగించి వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు విద్యార్థుల నుంచి ప్రతిఘటన వ్యక్తం కాకుండా ఉన్నతాధికారులతో రహస్య మంతనాలు చేస్తున్నట్టు తెలిసింది. విద్యార్థి ఉద్యమాలను నీరుగార్చే బాధ్యతను వర్సిటీ ఉన్నతాధికారులకే అప్పగించినట్టు సమాచారం. హైకోర్టు భవన నిర్మాణాన్ని అడ్డుకోవడానికి విద్యార్థి విభాగాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అడ్డుకుంటాం
వ్యవసాయ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణమేంటో ? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3నెలల్లోనే యూనివర్సిటీ అస్థిత్వం దెబ్బతినేలా చేస్తున్నది. జంతు, పక్షి, ఔషధ వృక్షజాతులు, లక్షల వృక్ష సంపద నాశనం అవుతున్నది. రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నాం. అయినా రాత్రికి రాత్రే అన్యాక్రాంతం చేస్తున్నారు. విద్యార్థులకు, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించి పనులు చేస్తున్నారు. అయినా అక్రమంగా చేస్తున్న శంకుస్థాపనను అడ్డుకుంటాం – చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి
రియల్ ఎస్టేట్ కోసమే…
ప్రభుత్వం మొండిగా వ్యవహారిస్తున్నది. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికే. దాదాపు 40 ఏండ్లుగా ఎన్నో జీవరాశులను, ప్రకృతిని అక్కడ పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో విద్యార్థులు, ప్రొఫెసర్లు, న్యాయదేవత సాక్షిగా అవన్నీ అంతరించడం బాధాకరం.
– ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు