International
‘న్యూరాలింక్ సెకెండ్ ట్రయల్ సూపర్ సక్సెస్’ – ఎలాన్ మస్క్ – Neuralink Brain Chip
Neuralink Brain Chip Implant : మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే ప్రయోగంలో న్యూరాలింక్ మరో ముందడుగు వేసింది. తాజాగా మరో వ్యక్తికి మెదడులో చిప్‌ను అమర్చినట్లు న్యూరాలింక్ సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించారు. రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్‌లో దాదాపు 400 ఎలక్ట్రోడ్‌లు యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు మస్క్ తెలిపారు. అయితే అతడికి ఎప్పుడు సర్జరీ చేశారు? ఎలాంటి పరీక్షలు చేశారనే విషయాన్ని మస్క్ వెల్లడించలేదు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఈ ఏడాది చివరి వరకు మరో ఎనిమిది మందికి ఈ చిప్‌ను అమర్చనున్నట్లు మాత్రం మస్క్ పేర్కొన్నారు. ఓ పాడ్ కాస్ట్‌లో మస్క్ ఈ వివరాలను తెలియజేశారు.
ఇదే పాడ్ కాస్ట్‌లో మస్క్ సహా తొలి చిప్‌ను అందుకున్న వ్యక్తి నోలాండ్ అర్బాగ్‌తో పాటు న్యూరాలింక్‌కు చెందిన ముగ్గురు ఉన్నతోద్యోగులు కూడా పాల్గొన్నారు. చిప్‌ను అమర్చే విధానం, రోబోతో చేసే సర్జరీకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. చిప్ అమర్చడానికి ముందు ట్యాబ్లెట్‌ను ఆపరేట్ చేయడానికి నోట్లో ప్రత్యేక స్టిక్ ఉపయోగించాల్సి వచ్చేదని అర్బాగ్ తెలిపారు. ఇప్పుడు ఆ అవసరం రావడం లేదని వెల్లడించారు.
“మెదడులో చిప్ అమర్చిన మొదట్లో అర్బాగ్ కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఎలక్ట్రోడ్లలో కొన్ని మెదడు నుంచి బయటకొచ్చేశాయి. ఈ లోపాన్ని ముందే పసిగట్టిన న్యూరాలింక్ సమస్యను సమర్థంగా పరిష్కరించింది. కంప్యూటర్‌ను ఆపరేట్ చేసే విషయంలో అర్బాగ్ రికార్డు నెలకొల్పారు.” అని ఎలాన్ మస్క్ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.
పందులు, కోతులపై ట్రయల్స్ సక్సెస్!
వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేందుకు మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను విజయవంతంగా అమర్చినట్లు ఈ ఏడాది జనవరి చివర్లో న్యూరాలింక్ తెలిపింది. కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్- కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ (బీసీఐ) ప్రయోగాలకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ గతేడాది మేలో ఆమోదమద్ర వేసింది. న్యూరాలింక్ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు పేర్కొన్నారు. దీని సాయంతో ఒక కోతి పాంగ్ వీడియో గేమ్‌ను సైతం ఆడిందని తెలిపారు.