National

Mumbai Rains : ముంబైలో ఆరు గంటల్లో రికార్డు స్థాయి వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు.. వీడియోలు వైరల్

Published

on

Mumbai Rain Updates : దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఆరు గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 31.5 సెంటీమీటర్లు, పోవాయ్ లో 31.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాల్లో పట్టాలపైకి వర్షపు నీరు చేరడంతో సబర్బన్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ రైల్వే రూట్లలో లోకల్ రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా ముంబైలోని పలు రహదారులపైకి భారీగా వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.


రానున్న మూడ్రోజులు ముంబై సహా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖవెల్లడించింది. దీంతో బీఎంసీ పరిధిలోని స్కూల్స్, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ముంబై యూనివర్శిటీల్లో ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. భారీ వర్షాల కారణంగా విమానాశ్రయాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పలు విమానాలను దారి మళ్లించారు. 27 మిమానాలను అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్ లకు మళ్లించినట్లు తెలిసింది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అధికారులను ఆదేశించారు.


ముంబైతోపాటు ఠాణె, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్ కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పాల్ఘార్ జిల్లాలో పోలంలో పనిచేస్తూ వరదల్లో చిక్కుకున్న 16 మంది గ్రామస్తులను ఎన్డీఆర్ఎప్ బృందాలు రక్షించాయి. మరోవైపు రాయ్‌గఢ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా.. రాయ్‌ఘడ్ కోటకు పర్యాటకులను నిలిపివేశారు. రాయగడకోటకు వెళ్లే చిత్త దర్వాజా, నానే దర్వాజ రహదారులను బారికేడ్లతో మూసివేశారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version