National
Mumbai rain : ముంబైలో భారీ వర్షాలు.. 24గంటల పాటు రెడ్ అలర్ట్.. 50కిపైగా విమానాలు రద్దు
IMD Issues Red Alert : భారీ వర్షాలు ముంబైను ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముంబైలోని వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో వర్షపు నీరు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 50 విమానాలు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో రైళ్లు రద్దుకాగా.. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైలో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముంబైలో 24గంటలు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే మినహా ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించింది.
ముంబైలోని విద్యా సంస్థలకు బీఎంసీ సెలవులు ప్రకటించింది. నేవీ ముంబై, థానే రాయ్‌గఢ్‌లోని అన్ని పాఠశాలను మూసివేయాలని అధికారులు సూచించారు. జూలై 12వ తేదీ వరకు ముంబైలోని పాల్ఘర్, థానే, ధూలే, నందుర్‌బార్, జల్గావ్, నాసిక్, అహ్మద్‌నగర్, కొల్హాపూర్, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగాబాద్, జాల్నా, పర్భానీ, బీడ్, హింగోలి, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్, అకోలా, అమరావతి, భండారా ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
సతారా, పూణే జిల్లాల్లోని ఘాట్ ప్రాంతాలతో సహా మధ్య మహారాష్ట్రలో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రదేశాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలతో కూడిన దక్షిణ కొంకణ్ కు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మరఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.