International
చంద్రుడిపై దిగిన చైనా వ్యోమనౌక- అక్కడ మట్టి నమూనాల సేకరణ- చరిత్రలోనే తొలిసారి!
China Moon Landing Mission : చాంగే-6 ల్యూనార్ ప్రోబ్ విజయవంతంగా చంద్రుడి దక్షిణధ్రువంపై దిగినట్లు చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ల్యాండర్, అసెండర్‌తో కూడిన ఈ ప్రోబ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రాంతంలో విజయవంతంగా దిగినట్లు తెలిపింది. అత్యంత అరుదైన ప్రాంతంలో నమూనాలను మానవచరిత్రలోనే తొలిసారి సేకరించినట్లు ప్రకటించింది. కొయెచావ్-2 రిలే ఉపగ్రహం సాయంతో ల్యాండర్ దిగినట్లు పేర్కొంది. రెండ్రోజుల పాటు ప్రోబ్ మట్టి నమూనాలను సేకరిస్తుందని తెలిపింది. రెండు పద్దతుల్లో ల్యూనార్ ప్రోబ్ నమూనాలను సేకరిస్తుందని పేర్కొంది. డ్రిల్లింగ్ చేసి నేలలో నమూనాలను సేకరించడం ఒక పద్దతికాగా రెండోది రోబో చేయి ఉపరితలంపై ఉన్న మట్టిని సేకరించడం. అక్కడికక్కడే మట్టి నమూనాలను శాస్త్రీయ విశ్లేషణ జరుగుతుందని వివరించింది. తద్వారా చంద్రుడి చరిత్రను తెలుసుకోనున్నట్లు వెల్లడించింది. చాంగే-6లో ఆర్బిటర్, రిటర్నర్, ల్యాండర్, అసెండర్ ఉన్నాయి. మే 3న పంపిన చాంగే-6 వివిధ దశలను దాటుకుంటూ చంద్రుడిని చేరింది.