National
మోడీ తొలి విదేశీ పర్యటన….
: ప్రధాని మోదీ ఈవారంలో ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరగబోయే జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొన నున్నారు. కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ వెళ్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే.
ఇటలీలోని బోర్గో ఎగ్నాలజియా ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో జూన్ 13-15 తేదీల్లో జీ7 దేశాల సదస్సు జరగనుంది.
అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మాన్యేయేల్ మెక్రాన్.. జపాన్ , కెనడా ప్రధానులు పులియో కిషిదా, జస్టిన్ ట్రూడో తదితర నేతలు సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సమావేశం కోసం జూన్ 13న ప్రధాని ఇటలీ వెళ్లి.. 14వ తేదీన రాత్రికి తిరిగి స్వదేశానికి రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రధాని వెంట కేంద్ర విదేశాంగ ప్రధాని ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సదస్సులో భాగంగా పలువురు ప్రపంచ నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ కెనడా ప్రధాని ట్రూడో ముఖా ముఖీ భేటీ ఉంటుందా ? లేదా ? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంద
గతేడాది జపాన్‌లో హిరోషిమా వేదికగా జరిగిన జీ7 దేశాల సదస్సుకు మోదీ హాజరైన సంగతి తెలిసిందే . అందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, ఇతర ప్రపంచ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఈ ఏడు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో పాటు గాజాలో ఇజ్రాయిల్ యుద్ధం అంశాలపై చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయ.