Hyderabad
MLC Kavitha: సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని ఉల్లంఘించి కవితను అరెస్టు చేశారు: న్యాయవాది విక్రమ్ చౌదరి
దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ఈడీ అధికారులు ఈ ఉదయం హాజరుపరిచారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా..
ఈడీ తరఫున ఎన్.కె మట్టా, జోయబ్ హుసేన్ వాదనలు కొనసాగించారు.
సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ ఉల్లంఘించి కవితను అరెస్టు చేశారని విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించారు. ”ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. సమన్లు ఇవ్వం.. కవితను అరెస్టు చేయబోమని గత ఏడాది సెప్టెంబర్ 15న ఈడీ చెప్పింది. సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగాయి. ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టులో చెప్పిన అన్ని విషయాలతో ఒక అప్లికేషన్ దాఖలు చేస్తాం. అత్యున్నత న్యాయస్థానంలో మౌఖికంగా చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉల్లంఘించింది. మొత్తం కేసు క్వాష్ చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాం. దీనిపై విచారణ జరుగుతుండగానే ఆమెను అరెస్టు చేశారు. మహిళల విచారణపై నళినీ చిదంబరం వేసిన కేసుకు కవిత కేసును జతపరిచారు” అని కవిత తరఫు లాయర్ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ తీరును కోర్టుకు వివరించారు. నిన్న మరోసారి కేసు విచారణకు వచ్చిందని చెప్పారు. విచారణలో జరిగిన వాదనలను జడ్జి నాగపాల్‌కు వివరించారు.
ఆ తర్వాత ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ‘మీడియాలో వచ్చిన విషయాలను పరిగణనలోకి తీసుకోవద్దు. సెప్టెంబర్ 15న వచ్చే 10 రోజుల్లో సమన్లు ఇవ్వం అని మాత్రమే చెప్పాం. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఏఎస్‌జీ చెప్పారు. ఒక ఆర్డర్ అనుకూలంగా ఉంటే.. దానిని నిరవధిక కాలానికి వర్తింపుజేసుకోవద్దు. వేరే వారికి ఇచ్చిన ఉత్తర్వులను అన్వయించుకోవద్దు. మధ్యంతర ఉత్తర్వును మొత్తానికి వర్తించుకోవడం మంచిదికాదు. సుప్రీంకోర్టులో ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకు రాదు. తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు లేవు. కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి మాత్రమే చేశారు” అని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.