Hyderabad
MLC Kavitha Arrest : లిక్కర్ కేసులో సంచలనం – ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఢిల్లీకి తరలింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టగా…. ఆమెను అరెస్ట్ చేశారు.
IT ED Raids MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) నివాసంలో ఈడీ సోదాలు సంచలనంగా మారాయి. లిక్కర్ కేసులో(Delhi liquor Scam) ఈడీతో పాటు ఐటీ అధికారులు ఇవాళ మధ్యాహ్నం తర్వాత తనిఖీలు చేపట్టాయి. అయితే ఈ సందర్భంగా…. కవితకు సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. అనంతరం కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది ఈడీ. కవిత అరెస్ట్ సమాచారాన్ని భర్త అనిల్ కుమార్ కు తెలిపింది.
మరోవైపు కవిత నివాసం వద్ద బీఆర్ఎస్, జాగృతి కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోదాల్లో భాగంగా…. కవితకు సంబంధించిన రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
కవిత నివాసానికి కేటీఆర్, హరీశ్….
మరోవైపు కవిత అరెస్ట్ వార్తల నేపథ్యంలో…. సమాచారం అందుకున్న కేటీఆర్, హరీశ్ రావు… వెంటనే కవిత నివాసానికి చేరుకున్నారు. అయితే కవిత ఇంటి గేట్లను మూసివేయించిన అధికారులు… ఎవరిన్ని కూడా లోపలికి అనుమతించలేదు. మరోవైపు కవిత తరపు అడ్వొకేట్ సోమ భరత్ ను కూడా లోపలికి అనుమతించలేదు. ఈడీ తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వేళ కేసీఆర్ ను దెబ్బతీసేందుకే ఈ తరహా అరెస్టుకు దిగారని ఆరోపిస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
కేటీఆర్ వాగ్వాదం….
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు చెప్పటంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఢిల్లికి తరలింపు….!
మరోవైపు కవితను ఢిల్లీకి తరలించేందుకు ఈడీ(ED) అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఫ్లైట్ టికెట్లను బుకింగ్ చేసింది. ఇవాళ రాత్రి 08.45 నిమిషాలకు విమానంలో ఢిల్లీకి తరలించనుంది.
ఈ కేసుకు సంబంధించి గత రెండేళ్లుగా కవితపై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సౌత్ గ్రూపునకు సంబంధించి కీలక విషయాల్లో కవిత ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా పలుమార్లు సీబీఐ, ఈడీ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు కవిత. రెండు సార్లు సీబీఐ అధికారులు… హైదరాబాద్ కవిత నివాసంలో విచారణ కూడా జరిపారు. ఇదే క్రమంలో గతేడాది మార్చిలో ఢిల్లీలోని ఈడీ(Enforcement Directorate) ఆఫీస్ లో జరిగిన విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఆ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ కవిత అరెస్ట్ కాలేదు. లిక్కర్ కేసులో తన పేరును ప్రస్తావించటంతో పాటు మహిళలను విచారించే పద్ధతిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసుపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. తుది తీర్పు వచ్చే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు తీర్పునిచ్చింది.
కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ…. ఆ తర్వాత కూడా సీబీఐ(CBI) అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతకుముందు కవిత పేరు కేవలం సాక్షిగా మాత్రమే ఉండగా… ఇటీవలే నిందితురాలిగా పేర్కొంది సీబీఐ. విచారణకు హాజరుకావాలని కూడా సమన్లను జారీ చేసింది. అయితే విచారణకు హాజరుకాలేనని కవిత బదులిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా క్యాంపెయినింగ్ బాధ్యతలు ఉన్నాయని… ఈ కారణాల రీత్యా హాజరుకాలేనని రిప్లే ఇచ్చింది. మరోవైపు సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందనున్న కవిత విచారణకు హాజరుకాలేదని వార్తలు వచ్చాయి. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. మార్చి 19వ తేదీకి విచారణకు వాయిదా వేసింది.