International
మెక్సికో అధ్యక్ష పీఠంపై తొలిసారిగా మహిళ- దేశాధ్యక్షురాలిగా షీన్‌బామ్ రికార్డ్ – Mexico Election 2024
Mexico Election 2024 Results : మెక్సికోకు మెదటి సారిగా ఓ మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికై కొత్త చరిత్ర సృష్టించారు. దాదాపు 200 ఏళ్ల చరిత్రలో దేశానికి తొలిసారి ఓ మహిళ అధ్యక్షురాలిగా వ్యవహరించనున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో క్లాడియా షీన్‌బామ్ ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఉన్న దేశాధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపేజ్ ఒబ్రాడర్ స్థానంలో షీన్‌బామ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ ఒకటో తేదీన దేశాధ్యక్షురాలుగా కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా షీన్‌బామ్ గెలుస్తారని, 50-60 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశాయి.
దేశ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచనని కొత్తగా ఎన్నికైనా మెక్సికో అధ్యక్షురాలు షీన్‌బామ్ అన్నారు. లోపేజ్ ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. ఓ మహిళ మెక్సికోకు అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం తన జీవితంతో మరిచిపోలేని క్షణాలని ప్రత్యర్థి అభ్యర్థి గాల్వేజ్ అన్నారు. ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా ఉన్న లోపేజ్ కూడా క్లాడియా షీన్బామ్ను అభినందించారు. తన కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందడం సంతోషంగా ఉందని తెలిపారు.
క్లాడియా షీన్‌బామ్ ఎవరు?
క్లాడియా 1962 జూన్ 24న మెక్సికోలో జన్మించారు. షీన్‌బామ్ కుటుంబం బల్గేరియా నుంచి మెక్సికోకు వచ్చి స్థిరపడింది. నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ చేశారు. క్లాడియా ఒక శాస్త్రవేత్త. కాలిఫోర్నియాలోని ఓ ల్యాబ్లో మెక్సికో ఇంధన వినియోగంపై పరిశోధనలు చేశారు. శాస్త్రవేత్తగా కేరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత 2018లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సంవత్సరంలో సిటీ మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆ పదవికి ఎన్నికైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. కొవిడ్ సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా పరిమితులను విధించారు. అలాగే పర్యావరణపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మెక్సికో నగర ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. క్లాడియా షీన్‌బామ్ నాయకత్వ సామర్థ్యాలు, చేపట్టిన కార్యక్రమాలు లాంటి వాటికి ప్రజలు ఆకర్షితులయ్యారని, అందుకే దేశ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.