Andhrapradesh

భారీగా నమోదైన ఓటింగ్ శాతం – అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో జనం – Andhra Pradesh Elections 2024

Published

on

Andhra Pradesh Elections 2024: రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నవేళ ప్రజలు భారీగా ఓటెత్తి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటిచెప్పారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది స్వస్థలాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా యువతరంలో ఉత్సాహం బాగా కనిపించింది. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో సగటున రెండు నుంచి రెండున్నర గంటలపాటు క్యూలైన్లలో నిలుచోవాల్సి వచ్చినా ఓటర్లు తమ సంకల్పం వీడలేదు. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా మధ్యాహ్నం వేళలోనూ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు.

సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసేటప్పటికి దాదాపు 3 వేల 500కు పైగా పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని క్యూలైన్లలో ఒక్కోచోట కనీసం 100 నుంచి 200 మంది బారులు తీరి ఉండటంతో వారందరికీ ఓటేసే అవకాశమిచ్చారు. కొన్ని కేంద్రాల్లో రాత్రి పొద్దుపోయేదాకా పోలింగ్‌ కొనసాగింది. తిరువూరు నియోజకవర్గం చింతలకాలనీలో అర్ధరాత్రి వరకు పోలింగ్‌ జరిగింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గొటివాడ అగ్రహారం, విశాఖ జిల్లా పద్మనాభం మండలం, భీమునిపట్నంలోనూ పోలింగ్‌ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒంగోలు మండలం త్రోవగుంట పోలింగ్ కేంద్రం రాత్రి ఎనిమిదిన్నర సమయంలోనూ నిబంధనలు ఉల్లంఘించి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది.

రాష్ట్రంలో పోలింగ్‌ మొదలైన తొలి రెండు గంటల్లో 9.21శాతమే నమోదైంది. అక్కడి నుంచి గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. రాత్రి చివరిగా సేకరించిన సమాచారం ప్రకారం 78.39 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ప్రధానంగా 11 నుంచి 1 గంట మధ్యే ఎక్కువ పోలింగ్‌ నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలింగ్‌ సరళిని విశ్లేషిస్తే గంటకు సగటున 7 నుంచి 9 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.64 శాతం మేర పోలింగ్‌ జరిగింది. అప్పటితో పోలిస్తే ఈసారి పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఈసీ అంచనా వేస్తోంది.

అర్ధరాత్రి వరకు నమోదైన పోలింగ్​ శాతం (ETV Bharat)


అత్యల్పం – అత్యధికం: సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ నమోదైన పోలింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 79.90 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత 78.84 శాతంతో డోన్‌ నియోజకవర్గం రెండోస్థానంలో, 78.55 శాతంతో జమ్మలమడుగు మూడోస్థానంలో, 79.38 శాతంతో రామచంద్రపురం నాలుగో స్థానంలో, 78.19 శాతంతో మైదుకూరు అయిదో స్థానంలో ఉన్నాయి.

రాష్ట్రంలోనే అత్యల్పంగా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 45.78 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత అత్యల్ప పోలింగ్‌ నమోదైన నియోజకవర్గాల జాబితాలో 52.37 శాతంతో తిరుపతి రెండోస్థానంలో, 53.31 శాతంతో విశాఖపట్నం దక్షిణం మూడోస్థానంలో, 54 శాతంతో విశాఖపట్నం ఉత్తరం నాలుగో స్థానంలో, 55.7 శాతంతో రాజమహేంద్రవరం సిటీ అయిదో స్థానంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో తక్కువ పోలింగ్‌ జరిగింది. లోక్‌సభ నియోజకవర్గాల్లో మచిలీపట్నంలో అత్యధికంగా 73.53 శాతం మేర పోలింగ్‌ జరగ్గా అరకులో అత్యల్పంగా 58.2 శాతం పోలింగ్‌ నమోదైంది. విశాఖపట్నంలోనూ 59.39 శాతం పోలింగే జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version