Weather
మండుటెండల్లో అదిరిపోయే శుభవార్త.. ఈసారి నైరుతిలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
దేశంలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశానికి వర్షాలు కురిపించే నైరుతి రుతుపవనాలపై వాతావరణ విభాగం కీలక సమాచారం వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్‌లుక్ ఫోరం (SASCOF) మంగళవారం వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో బలహీనపడి లానినో ఏర్పడుతోందని, దీంతో ఆగస్టు-సెప్టెంబరు మధ్య భారత్‌లో సాధారణం కంటే అధికంగానే వర్షాలు పడతాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. తాజా అంచనాలు వాటిని మరింత బలపరుస్తున్నాయి.
‘2024 నైరుతి రుతుపవనాల కాలం (జూన్-సెప్టెంబరు)లో దక్షిణాసియాలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయి. అయితే కొన్ని ఉత్తర, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే కొద్దిగా తక్కువ వానలు పడతాయి.. సాధారణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ఆగ్నేయ భాగంలోని కొన్ని ప్రాంతాలను మినహాయించి ఈ సీజన్‌లో దక్షిణాసియాలోని చాలా ప్రాంతాలలో సాధారణ కంటే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి’ అని ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్ తెలిపింది.
ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్ తాజా అంచనాలను దక్షిణాసియాలోని తొమ్మిది వాతావరణ విభాగాలు సంయుక్తంగా రూపొందించాయి. ఇందుకు అంతర్జాతీయ నిపుణుల సహకారాన్ని తీసుకున్నాయి. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు మోస్తరుగా ఉన్నాయని, నైరుతి మొదటి సీజన్‌కి తటస్థమవుతుందని SASCOF అంచనా వేసింది.
రెండో దశ నాటికి లా నినా పరిస్థితులు ఏర్పడవచ్చని పేర్కొంది.
ఎల్ నినో కారణంగా మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కి, దేశంలో రుతుపవనాలను ప్రభావితం చేస్తుంది. తక్కువు వర్షపాతం, పొడి వాతావరణ పరిస్థితులకు కారణమవుతుంది. లా నినా అనేది దీనికి పూర్తిగా భిన్నం. ఇక, రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ తెలిపారు.
హిందూ మహాసముద్ర ద్విధ్రువ పరిస్థితులు భారత్‌లో రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఉత్తరార్ధగోళంలో మంచు కవచం తక్కువగా ఉండటం వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంటున్నారు. ఉత్తరార్ధ గోళంలోని శీతాకాలం, వసంత ఋతువు మంచు కవచం సాధారణంగా దక్షిణాసియాపై తదుపరి నైరుతి రుతుపవనాల వర్షపాతంతో విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది లోటు వర్షపాతంతో దేశంలోని వ్యవసాయ రంగానికి నష్టాలతో పాటు తాగునీటి ఎద్దడి కూడా నెలకుంది.