International
మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్.. ఈ ఐడియా అదుర్స్ కదూ..
Philippines Mall: మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది. మనుషులైనా తమ ఉద్యోగంలో అలసట, బద్ధకం ప్రదర్శిస్తారేమోగానీ ఈ పిల్లి మాత్రం విధుల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా చేస్తోంది. ఫిలిప్పీన్స్‌లో ఆ పిల్లి విధులు నిర్వహిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
మాండలుయోంగ్ మెట్రో మనీలాలోని మాల్‌లో మెగావరల్డ్ కార్పొరేట్ సెంటర్ ఈ పిల్లిని సెక్యూరిటీ జాబ్ లో నియమించింది. ఆల్ డే సూపర్ మార్కెట్లోని గేట్ వద్ద ఈ పిల్లి ఉంటుంది. కోనన్ బ్యాగ్‌లను తనిఖీ చేయడంలో ఈ పిల్లి సాయపడుతుంది. అంతేగాక, ఎవరైనా మాల్‌కి పెంపుడు జంతువులను తెచ్చుకుంటే వాటిని కూడా స్వాగతిస్తుంది.
ఇంతకీ ఈ పిల్లి వయసు ఎంతో తెలుసా? కేవలం ఆరు నెలలు మాత్రమే. ఆ మాల్‌లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిలో ఈ పిల్లి భాగమైపోయింది. సెక్యూరిటీ సిబ్బంది ఒత్తిడిని కూడా ఈ పిల్లి తగ్గిస్తోంది. ఈ పిల్లిని సెక్యూరిటీ గార్డ్ కోనన్ అని పిలుస్తారు. ఈ పిల్లి పనితీరును చూసి ఇతర మాల్స్ కూడా పిల్లులను పనిలో పెట్టుకోవాలని యోచిస్తున్నాయి.