Hyderabad
మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దులో హై అలర్ట్.. డ్రోన్ కెమెరాలతో నిఘా
మహారాష్ట్ర గడ్చిరోలి ఎన్ కౌంటర్‌తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. గడ్చిరోలి ఎన్ కౌంటర్‌తో మావోలు ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుండి తెలంగాణాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రాణహిత తీరం వెంట హై అలర్ట్ ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని రేపనపల్లి వద్ద కొలమరక అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న కుమురంభీం-మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యుడు, మంగి – ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గీస్ , సిర్పూర్-చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మక్తు, మావోయిస్టు మిలటరీ ప్లటూన్ సభ్యులు కుర్సెంగ రాజు, మెట్ట వెంకటేష్ లు హతమవడంతో మంగీ అభయారణ్యం, ప్రాణహిత సరిహద్దు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెంచారు జిల్లా పోలీసులు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అలజడి రేపేందుకు.. ఎన్నికలను అడ్డుకునేందుకు విధ్వంసం సృష్టించేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేసే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఉమ్మడి ఆదిలాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రాణహిత తీరం వెంట డ్రోన్ల సాయంతో నిఘాను కట్టుదిట్టం చేశారు. పెరీ పాయింట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల చర్యలు తిప్పికొట్టేందుకు ఇటీవలే ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు మంచిర్యాల జిల్లాలో ప్రత్యేక సమావేశమై వ్యూహరచన చేయగా.. వారం రోజుల వ్యవధిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ కమిటీ కీలక మావో నేతలను మట్టుబెట్టడంతో పోలీసులు పై చేయి సాధించినట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనతో మావోయిస్ట్‌లు ప్రతికార చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో మరింత అలర్ట్ అయ్యారు పోలీసులు. మూడు రాష్ట్రాలకు కొరకని కొయ్యగా మారిన వర్గీస్‌ను మట్టుబెట్టడంలో మహారాష్ట్ర సీ 60 బలగాలతో పాటు తెలంగాణ గ్రే హౌండ్ పోలీసుల పాత్ర ఉండటంతో మావోయిస్ట్‌లు తెలంగాణ పోలీసులు టార్గెట్‌గా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా – తెలంగాణ మంచిర్యాల జిల్లా సరిహద్దులోని వేమనపల్లి, కోటపల్లి మండలాల ప్రాణహిత తీరం వెంట ఉన్న రీచులను వారం రోజుల క్రితం రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో సందర్శించి సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేయగా.. తాజాగా ప్రాణహిత సరిహద్దుకు కొద్ది దూరంలోనే ఎన్ కౌంటర్ చోటుచేసుకోవడం మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్ కెమెరాలతో ప్రాణహిత తీరాన్ని నిషితంగా పరిశీలిస్తున్నారు. అడవుల్లో కూంబింగ్ చేస్తూనే ప్రాణహిత తీరం వెంట అణువణువు జల్లెడ పడుతున్నారు. తెలంగాణ మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు ప్రధాన రహదారి మార్గంగా ఉన్న 63వ జాతీయ రహదారిపై పోలీసులు విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నారు.