Spiritual

Maha Shivratri: శివరాత్రి ప్రాశస్త్యం.. లింగోద్భవం పురాణ గాథ తెలుసా?

Published

on

Maha Shivratri సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు (Lord Shiva). భక్తుల పాలిట పెన్నిధి, భోళా శంకరుడైన ఈశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి (Maha Shivratri).

యావత్‌ సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించిన దినం కావడంతో మహాశివరాత్రిగా పరిగణిస్తారు.

‘శివ’ అన్న పదానికి మంగళకరం.. శుభప్రదం అని అర్ధం. కైలాసనాథుడైన ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన దినాన ఉపవాసం.. జాగరణ నిర్వహించాల్సి వుంటుంది.

లింగోద్భవం
మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవానికి సంబంధించిన ఒక పురాణగాథను తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. అయితే ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమయంలో ప్రళయకర్తయైన శివుడు గొప్ప జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. ఆ మహా శివలింగానికి ఆది, అంతాలను బ్రహ్మ, విష్ణువులు కనిపెట్టలేకపోయారు. దీంతో వారికి కనువిప్పు కలిగింది. నాగభూషణధారి పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన దినాన్నే శివరాత్రిగా పండితులు పేర్కొంటారు.
ప్రళయ కాళరాత్రి తరువాత జగన్మాత కోరిక మేరకు శివుడు మళ్లీ జీవకోటిని ఉద్భవింపచేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం సనాతన సంప్రదాయం. శివరాత్రికి ముందు ఒక్క రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి పర్వదినం నాడు ఉదయం స్నానాదులు పూర్తి చేసుకొని శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం వుండాలి. రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాల్సి వుంటుంది. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది.
ప్రపంచంలో అన్ని దేవతామూర్తులను వారి రూపాల్లోనే కొలుస్తాం. అయితే చంద్రశేఖరుడిని మాత్రం లింగంగా పూజించడం ఒక విశిష్టత. నిండు మనస్సుతో, భక్తితో పిలిస్తే చాలు ఆ లింగమూర్తి మనకు ప్రత్యక్షమవుతాడు. సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు. తనను యముని బారినుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ఒసంగిన భక్తజన బాంధవుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version