Cricket
LSG vs CSK, IPL 2024: రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చిత్తుగా ఓడిన చెన్నై
Lucknow Super Giants vs Chennai Super Kings: ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం(ఏప్రిల్ 19) రాత్రి పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57 నాటౌట్) టాప్ స్కోరర్ గా నిలవగా, అజింక్యా రహానే (36), మొయిన్ అలీ (30), ధోనీ (28) రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, మోసిన్, యశ్ ఠాకూర్, బిష్ణోయ్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లక్నో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్ రాహుల్ ( 53 బంతుల్లో 82, 9 ఫోర్లు, 3 సిక్స్ లు ), డికాక్ ( 43 బంతుల్లో 54, 5 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకాలతో చెలరేగిపోయారు. మొదటి వికెట్ కు ఏకంగా 134 పరుగులు జోడించి లక్నో విజయానికి బాటలు వేశారు. నికోలస్ పూరన్ (12 బంతుల్లో 23 నాటౌట్, 3 ఫోర్లు, ఒక సిక్స్), మార్కస్ స్టొయినిస్ (8 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ 1, పతిరన 1 వికెట్ తీశారు.