Weather
బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. మే 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
దీంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మే 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇది మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయిగుండంగా మారితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ప్రస్తుతానికి ఏపీ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ఆవర్త ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. దీని కారణంగా తెలంగాణలో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇప్పటికే గత వారం రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు ఏపీలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని తెలిపింది. ఆదివారంలోకి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి.
రుతుపవనాలు మే 31 కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత కేరళ అంతా వ్యాపించనున్నాయి. జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణలో కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు సకాలంలో పడితే పంటలు సాగు మొదలు పెట్టేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురిస్తే రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.