Andhrapradesh
మంగళగిరిలో లోకేశ్ పై మురుగుడు లావణ్య…. లావణ్య బ్యాగ్రౌండ్ ఏంటంటే..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ఎన్నికలకి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలోని ప్రధాన నేతలపై పోటీ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కుప్పం, హిందూపురం విషయంలో ప్రత్యేకంగా వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తోంది. ఇదే సమయంలో మంగళగిరిలో నారా లోకేశ్ ను ఓడించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే ఇటీవలే మురుగుడు లావణ్య అనే కొత్త అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. తాజాగా అసలు ఈమె ఎవరు అనే చర్చలు జరుగుతున్నాయి. మరి.. ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
2024లో మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఢీ కొట్టే ఈ మురుగుడు లావణ్య ఎవరా, ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటా విషయాలపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మురుగుడు లావణ్య విషయానికి వస్తే.. ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అంతేకాక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడులు. ఇక కాండ్రు కమలకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1987లో వైఎస్సార్ ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌గా మురుగుడు హనుమంతరావు పోటీ చేసి ఎన్నికయ్యారు.
అలానే ఆయన 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అనంతరం ప్రస్తుతం ఎమ్మెల్సీగా, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. మురుగుడు లావణ్య తల్లి కాండ్రు కమల విషయానికి వస్తే.. ఆమె 2004 నుంచి 2009 వరకు మంగళగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం టీటీడీ బోర్డు మెంబర్‌గా పనిచేశారు. అలా మొత్తంగా లావణ్యకు అటు పుట్టిల్లు, ఇటు అత్తగారి ఇళ్లు రాజకీయ నేపథ్యం కలిగింది. అలానే ఈ రెండు కుటుంబాలకు మంగళగిరిలో మంచి పేరుంది. మొత్తంగా మరోసారి లోకేశ్ ను ఓడించేందుకు లావణ్యను వైఎస్సార్ సీపీ బరిలో నిలిపింది.