National

Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ; గుజరాత్ లో తొలి విజయం

Published

on

Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియకముందే, కౌంటింగ్ ముగిసి, ఫలితాలను ప్రకటించక ముందే బీజేపీ ఒక స్థానంలో విజయాన్ని ఖాయం చేసుకుని, ఒక సీటును తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తొలి విజయం సాధించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం, ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈ విజయం సాధ్యమైంది. ‘సూరత్ లోక్ సభ స్థానం అభ్యర్థి ముఖేష్ భాయ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు’ అని గుజరాత్ ముఖ్యమంత్రి ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.

నామినేషన్ల తిరస్కరణ
సూరత్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులు చేసిన సంతకాలు ఫోర్జరీవని తేలడంతో ఆయన అభ్యర్థిత్వం రద్దు అయింది. అదే కారణంతో ప్రత్యామ్నాయ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ పద్సాలా నామినేషన్ ను కూడా రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. దాంతో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు ఈ స్థానంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ప్యారేలాల్ భారతితో పాటు మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

నామినేషన్ పత్రాల్లో ఫోర్జరీ సంతకాలు
కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాల్లోని ప్రతిపాదకుల సంతకాల్లో అవకతవకలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షలో తేలడంతో ఆయన నామినేషన్ ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) సౌరభ్ పర్ధి వెల్లడించారు. ఎన్నికల నామినేషన్ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ఆమోదించిన అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడానికి నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు అవసరం. అయితే అభ్యర్థి ఇండిపెండెంట్ అయినా, గుర్తింపు లేని రాజకీయ పార్టీ నామినేట్ చేసినా నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతిపాదకులుగా నామినేషన్ పత్రంలో సంతకం చేయాలి.

కోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్
గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించడంపై కోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ తెలిపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుజరాత్ లోని ఇతర స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.

Read also: 🗳తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం.. పెద్ద ఎత్తున పోటీ పడ్డ స్వతంత్య్ర అభ్యర్థులు.. https://infoline.one/telugu-states-nominations-end/

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version