National
లోక్‌సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి తెర- తమిళనాడుపై ఫుల్ ఫోకస్! – Lok Sabha Election 2024
Lok Sabha Election First Phase Polls : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న జరగనున్న తొలి విడత పోలింగ్‌కు ప్రచార పర్వం ముగిసింది. మొత్తం 102 నియోజకవర్గాల్లో కొద్దిరోజులుగా హోరెత్తిన మైకులు మూతపడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52 నాటి ఎన్నికలు మినహా దేశ చరిత్రలో సుదీర్ఘ కాలంపాటు జరుగుతున్న ఈ ఎన్నికలకు EC పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 19 నుంచి జూన్ ఒకటి వరకు 44 రోజులపాటు ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుండగా, తొలి విడత కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. EVMలు, VVప్యాట్ల పంపిణీ సహా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్‌లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో రెండేసి, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నారు. మణిపుర్‌లో రెండు స్థానాలకు తొలివిడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ, ఔటర్ మణిపుర్ నియోజకవర్గంలో మాత్రం మొదటి రెండు దశల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. 80 స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, 40 సీట్లు ఉన్న బిహార్, 42 సీట్లు ఉన్న బంగాల్లో మొత్తం ఏడు విడతల్లోనూ పోలింగ్ ఉండగా, తొలివిడత యూపీలో 8, బిహార్‌లో 4, బంగాల్‌లో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసోంలో 5, ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 5, రాజస్థాన్ 12, జమ్ముకశ్మీర్‌లో ఒక నియోజకవర్గానికి ఈనెల 19న పోలింగ్ జరగనుంది.
తమిళనాడుపై అందరి దృష్టి
తొలి విడత పోలింగ్‌లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ నటి రాధిక బీజేపీ తరఫున విరుధ్‌నగర్ బరిలో నిలిచారు. ఆమె ప్రత్యర్థిగా DMDK వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
బిహార్‌లోని జమూయ్ నియోజకవర్గం నుంచి LJP వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్‌విలాస్ పాసవాన్ కుమారుడు చిరాగ్ పాసవాన్ పోటీలో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫీలీబీత్‌లో వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాదకు అవకాశం కల్పించింది.
పోటీలో 8మంది కేంద్రమంత్రులు
తొలివిడతలో 8 మంది కేంద్ర మంత్రులు తమ పనితీరుపై ఓటరు తీర్పు కోరుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగ్‌పుర్ బరిలో నిలిచారు. మరో మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2004 నుంచి ఆయన ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిజిజుకు పోటీగా మాజీ సీఎం, కాంగ్రెస్ అరుణాచల్‌ప్రదేశ్ అధ్యక్షుడు నబం టుకీ ఎన్నికల బరిలో నిలిచారు. మరో కేంద్ర మంత్రి, మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ దిబ్రుగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్ ముజఫర్ నగర్ బరిలో నిలిచారు.
మరో మంత్రి జితేంద్ర సింగ్ ఉధమ్‌పgర్ నుంచి హ్యాట్రిక్ కొట్టాలని యత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు అయిన భూపేంద్ర యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ బికనీర్ బరిలో నిలిచారు. మరో మంత్రి ఎల్.మురుగన్ తమిళనాడులోని నీలగిరి నుంచి పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా నిలిచారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రామాణిక్ బంగాల్‌లోని కూచ్‌బిహార్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరందరి భవితవ్యం జూన్ 4న తేలనుంది.